CWG 2022 Tejaswini Shankar: వారం కిత్రం పేరు లేదు.. కుక్కలతో హై జంప్‌ ప్రాక్టీస్‌; కట్‌చేస్తే 

4 Aug, 2022 11:58 IST|Sakshi
కాంస్య పతకంతో తేజస్విన్‌ శంకర్‌

తేజస్విన్‌ శంకర్‌.. వారం క్రితం కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు ఎంపికయిన భారత బృందంలో  పేరు లేదు. హై జంప్‌ విభాగంలో క్వాలిఫై స్టాండర్డ్స్‌ అందుకోలేదన్న కారణంగా చూపి భారత్‌ అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ అధికారులు అతన్ని ఎంపిక చేయలేదు. దీంతో కోర్టు మెట్లు ఎక్కి విజయం సాధించిన తేజస్విన్‌ శంకర్‌ ఆఖరి నిమిషంలో కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు వెళ్లనున్న భారత బృందంలో బెర్త్‌ దక్కించకున్నాడు. 

తనను ఎంపిక చేయలేదన్న కోపమో లేక బాధో తెలియదు కానీ.. ఇవాళ 30వేల మంది ప్రేక్షకుల సమక్షంలో హై జంప్‌ విభాగంలో కాంస్య పతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. తన రికార్డును బ్రేక్‌ చేయలేదన్న బాధ ఉన్నప్పటికి కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌ తరపున హై జంప్‌ విభాగంలో పతకం సాధించిన తొలి అథ్లెట్‌గా తేజస్విన్‌ శంకర్‌ చరిత్ర సృష్టించాడు.

మరి బర్మింగ్‌హమ్‌లో కాంస్యం సాధించిన తేజస్విన్‌ శంకర్‌ హై జంప్‌ ప్రాక్టీస్‌ ఎలా చేశాడో తెలిస్తే షాకవుతారు. తాను రోజు ప్రాక్టీస్‌ చేసే జేఎల్‌ఎన్‌ గ్రౌండ్‌లో మూడు కుక్కలు ఉండేవి. వాటిని మచ్చిక చేసుకున్న శంకర్‌ హై జంప్‌ ప్రాక్టీస్‌ చేసేవాడు. రోజు వాటికి ఆహారం అందిస్తూ స్టిక్స్‌ ఏర్పాటు చేసి వాటి వెనకాల పరిగెత్తుతూ హై జంప్‌ చేసేవాడు. అలా హైజంప్‌లో మరింత రాటు దేలే ప్రయత్నం చేశాడు. అయితే భారత్‌ అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ అతనికి షాక్‌ ఇచ్చింది. అయితే కోర్టు మెట్లు ఎక్కడం ద్వారా విజయం సాధించిన తేజస్విన్‌ శంకర్‌ కామెన్‌వెల్త్‌ గేమ్స్‌లో అడుగుపెట్టాడు. వాస్తవానికి అథ్లెట్ల సంఖ్య కోటా ఎక్కువగా ఉన్నందున శంకర్‌ పేరును పరిగణలోకి తీసుకోలేదని తర్వాత తేలింది.

కట్‌చేస్తే.. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. బుధవారం హైజంప్‌ విభాగంలో జరిగిన ఫైనల్లో తేజస్విన్‌ శంకర్‌ 2.22 మీటర్ల ఎత్తు దూకి కాంస్యం ఒడిసిపట్టాడు. అయితే జూన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌ షిప్‌లో శంకర్‌ 2.27 మీటర్ల దూరం జంప్‌ చేయడం గమనార్హం. శంకర్‌ గత రికార్డుతో పోల్చితే కామన్వెల్త్‌లో కొంత నిరాశ పరిచినా ఇది కూడా గొప్ప ఘనత కిందే లెక్కించొచ్చు. ఇక ఈ విభాగంలో న్యూజిలాండ్‌కు చెందిన హమీష్‌ కెర్‌ 2.25 మీటర్ల జంప్‌చేసి మొదటి స్థానంలో నిలిచి స్వర్ణం సాధించగా, ఆస్ట్రేలియాకు చెందిన బ్రండన్‌ స్టార్క్‌ సిల్వర్‌ సాధించాడు.

చదవండి: CWG 2022: హైజంప్‌లో భారత్‌కు కాంస్యం.. తొలి అథ్లెట్‌గా రికార్డు

CWG 2022: వైరల్‌గా మారిన నిఖత్‌ జరీన్‌ చర్య.. ఏం జరిగింది?

మరిన్ని వార్తలు