CWG 2022: కామన్‌వెల్త్‌ క్రీడల్లో పాల్గొన్న ఇ‍ద్దరు పాకిస్థానీ బాక్సర్ల అదృశ్యం

11 Aug, 2022 11:38 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌ వేదికగా జరిగిన 22వ కామన్‌వెల్త్‌ క్రీడల్లో పాల్గొన్న ఇద్దరు పాకిస్థానీ బాక్సర్లు అదృశ్యమైన వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. క్రీడలు ముగిసాక స్వదేశానికి తిరుగు పయనం అయ్యేందుకు బర్మింగ్‌హామ్‌ ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్న ఆ ఇద్దరు, అక్కడి నుంచి కనిపించకుండా పోయారంటూ పాకిస్థాన్‌ బాక్సింగ్‌ ఫెడరేషన్‌ (పీబీఎఫ్‌) వెల్లడించింది. ప్రస్తుతం పీబీఎఫ్.. బర్మింగ్‌హామ్‌ పోలీసుల సహకారంతో ఆ ఇద్దరి ఆచూకీ కనిపెట్టే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

కొద్దిరోజుల కిందట కామన్‌వెల్త్‌ క్రీడల్లో పాల్గొన్న శ్రీలంకకు చెందిన 10 మంది అథ్లెట్లు కూడా ఇదే తరహాలో అదృశ్యమైన నేపథ్యంలో ఈ మిస్సింగ్‌ కేస్‌ చర్చనీయాంశంగా మారింది. కనిపించకుండా పోయిన బాక్సర్లు సులేమాన్‌ బలోచ్‌, నజీరుల్లా ఖాన్‌లుగా పీబీఎఫ్‌ పేర్కొంది. వీరిలో నజీర్‌ 86-92 కేజీల హెవీవెయిట్‌ విభాగం రౌండ్‌ ఆఫ్‌ 16లో వెనుదిరగగా.. 60-63.5 కేజీల విభాగంలో సులేమాన్‌ రౌండ్‌ ఆఫ్‌ 32లో ఓటమిపాలైనట్లు పీబీఎఫ్‌ పేర్కొంది.

బాక్సర్ల అదృశ్యంపై విచారణ నిమిత్తం పాకిస్థాన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు పీబీఎఫ్‌ ప్రకటించింది. కాగా, ఇదే ఏడాది బుడాపెస్ట్‌ వేదికగా జరిగిన 19వ స్విమ్మింగ్‌ వరల్డ్‌ ఛాంపియన్షిప్‌ సందర్భంగా ఫైజాన్‌ అక్బర్‌ అనే ఓ పాకిస్థానీ స్విమ్మర్‌ కూడా ఇలానే అదృశ్యమయ్యాడు. అతని ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు.
చదవండి:  కామన్వెల్త్‌లో భారత ఫెన్సర్‌కు స్వర్ణం

మరిన్ని వార్తలు