CWG 2022- Virat Kohli: మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం.. కంగ్రాట్స్‌: కోహ్లి

9 Aug, 2022 16:34 IST|Sakshi
కామన్‌వెల్త్‌ గేమ్స్‌ విజేతలకు కోహ్లి శుభాకాంక్షలు(PC: Virat Kohli Twitter)

Commonwealth Games 2022: కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి శుభాకాంక్షలు తెలిపాడు. ప్రతిష్టాత్మక క్రీడల్లో సత్తా చాటి దేశ ప్రతిష్టను ఇనుమడింపజేశారని కొనియాడాడు. మిమ్మల్ని చూసి భారతీయులంతా గర్వపడుతున్నారంటూ ప్రశంసించాడు. కాగా జూలై 29 నుంచి ఆగష్టు 8 వరకు ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా కామన్‌వెల్త్‌ క్రీడలు జరిగిన విషయం తెలిసిందే. 

ఇందులో భాగంగా భారత్‌ ఈసారి 22 స్వర్ణాలు, 16 రజతాలు, 23 కాంస్య పతకాలు సాధించింది. రెజ్లింగ్‌లో 12, వెయిట్‌లిఫ్టింగ్‌లో 10, అథ్లెటిక్స్‌లో 8, బాక్సింగ్‌లో 7, టేబుల్‌ టెన్నిస్‌లో 7, బ్యాడ్మింటన్‌లో 6, జూడోలో 3, హాకీలో 2, లాన్‌ బౌల్స్‌లో 2, స్వ్కాష్‌లో 2, టీ20 క్రికెట్‌లో 1, పారా పవర్‌లిఫ్టింగ్‌లో 1 మెడల్స్‌ వచ్చాయి. 

ఇలా మొత్తంగా 61 పతకాలు గెలిచిన భారత్‌.. పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో భారత క్రీడా బృందానికి సోషల్‌ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగా కోహ్లి.. మంగళవారం ట్విటర్‌ వేదికగా స్పందించాడు.

గొప్ప పురస్కారాలు అందించారు!
ఈ మేరకు.. ‘‘మన దేశానికి గొప్ప పురస్కారాలు అందించారు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో పాల్గొన్న, గెలిచిన వాళ్లందరికీ శుభాకాంక్షలు. మిమ్మల్ని చూసి మేము గర్విస్తున్నాం. జై హింద్‌’’ అంటూ కోహ్లి పతకధారుల ఫొటోను షేర్‌ చేశాడు. ఇక ఆసియా కప్‌-2022 టోర్నీ నేపథ్యంలో విరాట్‌ కోహ్లి తిరిగి భారత జట్టులో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

ఇన్నాళ్లు విశ్రాంతి పేరిట జట్టుకు దూరంగా ఉన్న ఈ స్టార్‌ బ్యాటర్‌.. ఈనెల 27 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా ఈవెంట్‌కు ఎంపికైన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. సుదీర్ఘకాలంగా సెంచరీ చేయలేకపోయిన కోహ్లి.. ఈ టోర్నీలోనైనా విజృంభించాలని అభిమానులు కోరుకుంటున్నారు.


చదవండి: Ravindra Jadeja: మంచి మనసు చాటుకున్న జడేజా భార్య.. ఏకంగా 101 ఖాతాలు.. ప్రధాని మోదీ ప్రశంసలు

మరిన్ని వార్తలు