CWG 2022 Pak Vs Aus: మెక్‌గ్రాత్‌ ఆల్‌రౌండ్‌ షో.. పాక్‌ను మట్టికరిపించిన ఆసీస్‌

3 Aug, 2022 21:31 IST|Sakshi

కామన్‌వెల్త్‌ క్రీడల మహిళల క్రికెట్‌లో ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. గ్రూప్‌-ఏలో హాట్‌ ఫేవరెట్‌ అయిన ఆసీస్‌.. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విజయాలతో ఆరు పాయింట్లు సాధించి గ్రాండ్‌గా సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆరం‍భ మ్యాచ్‌లో భారత్‌పై 3 వికెట్లు తేడాతో గెలుపొందిన ఆసీస్‌.. ఆతర్వాత బార్బడోస్‌పై 9 వికెట్ల తేడాతో, తాజాగా పాక్‌పై 44 పరుగుల తేడాతో ఘన విజయాలు సాధించింది. 

మరోవైపు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైన పాక్‌.. గ్రూప్‌లో ఆఖరి స్థానంలో నిలిచి ఈవెంట్‌ నుంచి నిష్క్రమించింది. పాక్‌.. తమ తొలి మ్యాచ్‌లో పసికూన బార్బడోస్‌ చేతిలో, రెండో మ్యాచ్‌లో భారత్‌ చేతిలో, తాజాగా ఆసీస్‌ చేతిలో ఓటమిపాలైంది. గ్రూప్‌-ఏలో రెండో సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకునేందుకు ఇవాళ భారత్‌-బార్బడోస్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆసీస్‌తో పాటు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్‌ భారతకాలమానం ప్రకారం ఇవాళ (ఆగస్ట్‌ 3) రాత్రి 10:30 గంటలకు ప్రారంభంకానుంది. 

ఇక ఆసీస్‌-పాక్‌ మ్యాచ్‌ విషయానికొస్తే.. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. బెత్‌ మూనీ (49 బంతుల్లో 70 నాటౌట్‌; 8 ఫోర్లు, సిక్స్‌), తహీల మెక్‌గ్రాత్‌ (51 బంతుల్లో 78; 10 ఫోర్లు, సిక్స్‌) అజేయ అర్ధశతకాలతో రాణించారు. అనంతరం ఛేదనలో చేతులెత్తేసిన పాక్‌.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 116 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. బ్యాటింగ్‌లో రాణించిన తహీల మెక్‌గ్రాత్‌ (3/13) బౌలింగ్‌లోనూ చెలరేగి పాక్‌ పతనాన్ని శాసించింది. పాక్‌ బ్యాటర్లలో ఫాతిమా సనా (26 బంతుల్లో 35 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది.   
చదవండి: IND VS PAK: మౌకా.. మౌకా యాడ్‌కు మంగళం పాడిన స్టార్‌ స్పోర్ట్స్‌.. కారణం అదేనా..!

మరిన్ని వార్తలు