Ind W Vs Pak W: ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌.. మ్యాచ్‌ ఎప్పుడు, ఎక్కడ? పూర్తి వివరాలు!

20 Jul, 2022 13:56 IST|Sakshi
భారత మహిళా క్రికెట్‌ జట్టు

Commonwealth Games 2022- బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగనున్న కామన్‌వెల్త్‌ క్రీడలకు ఆటగాళ్లు సమాయత్తమవుతున్నారు. జూలై 28 నుంచి ఆగష్టు 8 వరకు ఈ ప్రతిష్టాత్మక క్రీడలు నిర్వహించేందుకు షెడ్యూల్‌ ఖరారైంది. ఇందులో భాగంగా భారత్‌, పాకిస్తాన్‌ మహిళా క్రికెట్‌ జట్లు పోరుకు సన్నద్ధమవుతున్నాయి. 

టి20 ఫార్మాట్‌లో జరిగే ఈ టోర్నీలో ఆస్ట్రేలియా, బార్బడోస్‌ జట్లతో కలిసి గ్రూప్‌ ‘ఏ’లో ఉన్నాయి ఈ రెండు జట్లు. ఈ క్రమంలో మొదట ఆసీస్‌తో తలపడనున్న హర్మన్‌ప్రీత్‌ సేన.. రెండో మ్యాచ్‌లో దాయాది జట్టు పాకిస్తాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు.. పాక్‌ జట్టు బార్బడోస్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

మరి భారత్‌- పాక్‌ మ్యాచ్‌ అంటే క్రేజ్‌ మామూలుగా ఉండదు కదా! జట్లు ఏవైనా దాయాదుల పోరు ఎల్లప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2022లో మహిళా జట్ల మధ్య మ్యాచ్‌ ఎప్పుడు, ఎక్కడ జరుగనుంది? లైవ్‌స్ట్రీమింగ్‌, జట్లు తదితర అంశాలు తెలుసుకుందాం!

భారత్‌ వర్సెస్‌ పాకిస్తాన్‌ మ్యాచ్‌:
►తేది: జూలై 31, 2022
►సమయం: భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆరంభం
►వేదిక: ఎడ్జ్‌బాస్టన్‌ క్రికెట్‌ గ్రౌండ్‌, బర్మింగ్‌హామ్‌, ఇంగ్లండ్‌
►ప్రసారాలు: సోనీ స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌, సోనీ లివ్‌లో ప్రత్యక్ష ప్రసారం

భారత జట్టు:
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), షఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, తానియా సప్న భాటియా(వికెట్‌ కీపర్‌), యస్తిక భాటియా , దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘన సింగ్, రేణుక ఠాకూర్‌, జెమీమా రోడ్రిగెస్‌, రాధా యాదవ్, హర్లీన్ డియోల్‌, స్నేహ్‌ రాణా. 

స్టాండ్‌ బై ప్లేయర్లు:
సిమ్రన్‌ దిల్‌ బహదూర్‌, రిచా ఘోష్‌, పూనమ్‌ యాదవ్‌

పాకిస్తాన్‌ జట్టు:
బిస్మా మరూఫ్‌(కెప్టెన్‌), ముబీనా అలీ(వికెట్‌ కీపర్‌), ఆనమ్‌ అమిన్‌, ఐమన్‌ అన్వర్‌, డయానా బేగ్‌, నిదా దర్‌, గుల్‌ ఫిరోజా(వికెట్‌ కీపర్‌), తుబా హసన్‌, కైనట్‌ ఇంతియాజ్‌, సాదియా ఇక్బాల్‌, ఈరమ్‌ జావేద్‌, అయేషా నసీమ్‌, అలియా రియాజ్‌, ఫాతిమా సనా, ఒమైమా సొహైల్‌.

కాగా వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా పాక్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో భారత్‌ 107 పరుగులతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా దాయాది జట్టుపై వరుసగా 11వ సారి గెలుపొంది సత్తా చాటింది.

చదవండి: Ind Vs WI ODI Series: వాళ్లంతా లేరు కాబట్టి మా పని ఈజీ.. మేమేంటో చూపిస్తాం: విండీస్‌ కెప్టెన్‌
Commonwealth Games 2022: కామన్‌ వెల్త్ గేమ్స్‌.. భారత అథ్లెట్లలో స్ఫూర్తి నింపిన ప్రధాని

మరిన్ని వార్తలు