Lovlina Borgohain: పంతం నెగ్గించుకున్న లవ్లీనా.. కామన్‌వెల్త్‌ గ్రామంలోకి కోచ్‌కు అనుమతి

26 Jul, 2022 19:42 IST|Sakshi

బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్‌ఐ) అధికారులు వేధిస్తున్నారంటూ నిన్న ట్విటర్‌ వేదికగా సంచలన ఆరోపణలు చేసిన టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, భారత స్టార్‌ మహిళా బాక్సర్‌ లవ్లీనా బోర్గోహైన్‌ ఎట్టకేలకు పంతం నెగ్గించుకుంది.  తన కోచ్‌ సంధ్యా గురుంగ్జీని కామన్ వెల్త్ విలేజ్‌లోకి అనుమతించడం లేదని లవ్లీనా చేసిన ఆరోపణలు నేపథ్యంలో బీఎఫ్‌ఐ స్పందించింది. కోచ్‌ సంధ్యా గురుంగ్జీని కామన్ వెల్త్ విలేజ్‌లోకి అనుమతించేలా ఏర్పాట్లు చేసి ఆమెకు హోటెల్‌లో వసతి కల్పించినట్లు బీఎఫ్‌ఐ వెల్లడించింది. 

అలాగే లవ్లీనాతో పాటు ట్రైనింగ్ క్యాంపుకు కోచ్‌ ​కూడా హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారులతో పాటు 33 శాతం సహాయక సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుందన్న నిబంధన కారణంగా లవ్లీనా కోచ్‌కు కామన్ వెల్త్ విలేజ్‌లోకి అనుమతి లభించలేదని బీఎఫ్ఐ వివరించింది. కాగా, బీఎఫ్‌ఐ అధికారులు తన ఇద్దరు కోచ్‌లను పదేపదే తొలగిస్తూ మానసికంగా వేధిస్తున్నారని లవ్లీనా నిన్న ట్విటర్‌ వేదికగా ఆరోపణాస్త్రాలను సంధించిన విషయం తెలిసిందే. 
చదవండి: బీఎఫ్ఐ అధికారులు వేధిస్తున్నారు.. స్టార్‌ మహిళా బాక్సర్‌ సంచలన ఆరోపణలు

మరిన్ని వార్తలు