Smriti Mandhana- Neeraj Chopra: నీరజ్‌ చోప్రా స్వర్ణం గెలిచినపుడు.. అద్భుతమైన ఫీలింగ్‌.. మేము సైతం!

22 Jul, 2022 15:39 IST|Sakshi
స్మృతి మంధాన(PC: BCCI)- నీరజ్‌ చోప్రా(PC: SAI)

Commonwealth Games 2022- Smriti Mandhana: ‘‘విశ్వవేదికపై భారత జాతీయ జెండా రెపరెపలాడినపుడు.. జాతీయ గీతం విన్నపుడు కలిగే అద్భుతమైన, అనిర్వచనీయమైన భావన ఎలా ఉంటుందో మా అందరికీ తెలుసు. కామన్‌వెల్త్‌, ఒలింపిక్‌ క్రీడల్లో ఇలాంటి అద్బుత క్షణాలను మేము కూడా ఆస్వాదించాం. స్వర్ణ పతకం గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం’’ అని భారత మహిళా క్రికెట్‌ జట్టు వైస్‌ కెప్టెన్‌ స్మృతి మంధాన అన్నారు.

ఆసీస్‌తో తొలి పోరు..
కాగా ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా జూలై 28 నుంచి ఆగష్టు 8 వరకు కామన్‌వెల్త్‌ క్రీడలు-2022 నిర్వహించేందుకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. 24 ఏళ్ల తర్వాత క్రికెటర్లకు ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో తిరిగి పాల్గొనే అవకాశం వచ్చింది.

మన జెండా ఎగరాలి..
ఇందులో భాగంగా భారత మహిళా జట్టు పతకం కోసం పోటీ పడేందుకు సిద్ధమైంది. కాగా టీ20 ఫార్మాట్‌లో నిర్వహించే కామన్‌వెల్త్‌ క్రికెట్‌ విభాగంలో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని భారత జట్టు మొదటగా జూలై 29న ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో స్మృతి మంధాన మాట్లాడుతూ.. ‘‘కేవలం నామమాత్రపు విజయాలకే మేము పరిమితం కావాలనుకోవడం లేదు.

మన జెండా పైకెగరాలి. జాతీయ గీతం వినిపించాలి. ప్రతి ఒక్కరు అనుభవించాలనుకునే అద్భుత భావన. ఒలంపిక్స్‌లో భారత్‌కు పసిడి పతకం అందించిన నీరజ్‌ చోప్రా గురించి తలచుకున్నప్పుడల్లా నాకు గూస్‌బంప్స్‌ వస్తాయి’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.

మేము సైతం..
అలాంటి బెస్ట్‌ ఫీలింగ్‌ కోసం తాము కూడా కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో స్వర్ణ పతకం గెలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఒలంపిక్స్‌లో కాకపోయినా కామన్‌వెల్త్‌లో పతకం గెలిచి ఈ లోటు పూడ్చుకుంటామని చెప్పుకొచ్చారు. ప్రత్యర్థి జట్లను ఎదుర్కొనేందుకు అన్ని విధాలా సమాయత్తమయ్యామని, ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని స్మృతి మంధాన పేర్కొన్నారు.

కాగా కామన్‌వెల్త్‌ క్రీడలు-2022లో మొత్తం ఎనిమిది మహిళా క్రికెట్‌ జట్లు పోటీ పడనున్నాయి. గ్రూప్‌-ఏలో భారత్‌, ఆస్ట్రేలియా, బార్బడోస్‌, పాకిస్తాన్‌ ఉండగా.. గ్రూప్‌ బిలో ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు ఉన్నాయి. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో భారత జావెలిన్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా బంగారు పతకం గెలుచుకుని సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
చదవండి: Ind Vs WI 1st ODI: రుతురాజ్‌కు నో ఛాన్స్‌! ధావన్‌తో ఓపెనర్‌గా అతడే! ఇక ఫినిషర్‌గా ఎవరంటే..
Ind W Vs Pak W: ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌.. మ్యాచ్‌ ఎప్పుడు, ఎక్కడ? పూర్తి వివరాలు!

మరిన్ని వార్తలు