ఈ రాంబాబు కథ స్పూర్తిదాయకం.. దినసరి కూలీ నుంచి ఏషియన్‌ గేమ్స్‌ పతాకధారిగా..!

14 Oct, 2023 12:18 IST|Sakshi

హాంగ్‌ఝౌ వేదికగా జరిగిన 2023 ఏషియన్‌ గేమ్స్‌లో భారత్‌ గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 107 పతకాలు సాధించి, పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రీడల్లో భారత్‌ అథ్లెటిక్స్‌ విభాగంలో మెజార్టీ శాతం పతకాలు సాధించి ఔరా అనిపించింది. ఈసారి పతకాలు సాధించిన వారిలో చాలామంది దిగువ మధ్యతరగతి, నిరుపేద క్రీడాకారులు ఉన్నారు. ఇందులో ఓ అథ్లెట్‌ కథ ఎంతో సూర్తిదాయకంగా ఉంది. 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ మారుమూల ప్రాంతానికి చెందిన రామ్‌ బాబు దినసరి కూలీ పనులు చేసుకుంటూ ఏషియన్‌ గేమ్స్‌ 35కిమీ రేస్‌ వాక్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో మంజూ రాణితో కలిసి కాంస్య పతకం సాధించాడు. రెక్క ఆడితే కానీ డొక్క ఆడని రామ్‌ బాబు తన అథ్లెటిక్స్ శిక్షణకు అవసరమయ్యే డబ్బు సమీకరించుకోవడానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దినసరి కూలీగా పనులు చేశాడు. కూలీ పనుల్లో భాగంగా తన తండ్రితో కలిసి గుంతలు తవ్వే పనికి వెళ్లాడు. ఈ పని చేసినందుకు రామ్‌ బాబుకు రోజుకు 300 కూలీ లభించేది. 

ఈ డబ్బులో రామ్‌ బాబు సగం​ ఇంటికి ఇచ్చి, మిగతా సగం తన ట్రైనింగ్‌కు వినియోగించుకునే వాడు. రామ్‌ బాబు తల్లితండ్రి కూడా దినసరి కూలీలే కావడంతో రామ్‌ బాబు తన శిక్షణ కోసం ఎన్నో ఆర్ధిక కష్టాలు ఎదుర్కొన్నాడు. ఈ స్థాయి నుంచి ఎన్నో కష్టాలు పడ​ రామ్‌ బాబు ఆసియా క్రీడల్లో పతకం సాధించే వరకు ఎదిగాడు. ఇతను పడ్డ కష్టాలు క్రీడల్లో రాణించాలనుకున్న ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. 

ఏషియన్‌ గేమ్స్‌లో పతకం సాధించడం​ ద్వారా విశ్వవేదికపై భారత కీర్తి పతాకను రెపరెపలాడించిన రామ్‌ బాబు.. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది ఉండదని నిరూపించాడు. లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి పేదరికం అడ్డురాదని రుజువు చేశాడు.  అతి సాధారణ రోజువారీ కూలీ నుంచి ఆసియా క్రీడల్లో  అపురూపమైన ఘనత సాధించడం ద్వారా భారతీయుల హృదయాలను గెలుచుకుని అందరిలో స్ఫూర్తి నింపాడు. 

తాజాగా ఈ రన్నింగ్‌ రామ్‌ బాబు కథ వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్రను కదిలించింది. రామ్‌ బాబు కథ తెలిసి ఆనంద్‌ మహీంద్ర చలించిపోయాడు. అతని పట్టుదలను సలాం  కొట్టాడు. నీ మొక్కవోని ధైర్యం ముందు పతకం చిన్నబోయిందని అన్నాడు. రామ్‌ బాబు ఆర్ధిక కష్టాలు తెలిసి అతన్ని ఆదుకుంటానని ప్రామిస్‌ చేశాడు. అతని కుటుంబానికి  ట్రాక్టర్ లేదా పికప్ ట్రక్కును అందించి ఆదుకోవాలనుకుంటున్నానని ట్వీట్‌ చేశాడు. 

Follow the Sakshi TV channel on WhatsApp: 

మరిన్ని వార్తలు