'ఆ వ్యాఖ్యలు చేసుంటే నన్ను క్షమించండి'

3 Mar, 2021 14:55 IST|Sakshi

కరాచీ: ఐపీఎల్‌లో ఆట కంటే డబ్బులకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని దక్షిణాఫ్రికా పేసర్‌ డేల్ ‌స్టెయిన్‌ మంగళవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే స్టెయిన్‌ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో స్టెయిన్‌ బుధవారం తనపై వస్తున్న విమర్శలపై మరోసారి స్పందించాడు.

''ఐపీఎల్‌తోనే నా కెరీర్‌ అద్భుతంగా సాగిందని నేను ఎప్పుడు అనను. కానీ ఐపీఎల్‌ను చులకన చేసి మాట్లాడి ఉంటే క్షమించండి. నా వ్యాఖ్యలను సోషల్‌ మీడియా తప్పుగా రాసుకొచ్చింది. ఒకవేళ నా వాఖ్యలు బాధించి ఉంటే క్షమించండి. పీఎస్‌ఎల్‌.. ఎల్‌పీఎల్‌ లాంటి లీగ్‌లతో ఐపీఎల్‌ను నేనెప్పుడు పోల్చలేదు. ఆటలో దేని ప్రాధాన్యం దానికే ఉంటుంది. అని'' రాసుకొచ్చాడు.

దీంతో పాటు వేలానికి ముందు జనవరిలో చేసిన ఒక ట్వీట్‌ను మరోసారి రీట్వీట్‌ చేశాడు. ఆ ట్వీట్‌లో..''ఈసారి ఐపీఎల్‌ల్‌కు నేను అందుబాటులో ఉండడం లేదు. గతేడాది ప్రాతినిధ్యం వహించిన ఆర్‌సీబీకి కూడా ఈ విషయం ఇప్పటికే తెలిపా. అంతేగాక ఈసారి వేలంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నా.. దీంతో పాటు ఐపీఎల్‌లో ఏ టీమ్‌కు ఆడకూడదని భావించా.. కేవలం ఐపీఎల్‌ నుంచి కొంతకాలం దూరంగా ఉండాలనేది దీని ఉద్దేశం. నన్ను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్యూ టూ ఆర్‌సీబీ. చివరగా ఒక్క మాట.. నేను ఇంకా ఆటకు గుడ్‌బై చెప్పలేదు'' అంటూ ముగించాడు. కాగా స్టెయిన్‌ ప్రస్తుతం పీఎస్‌ఎల్‌ లీగ్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా తరపున 93 టెస్టుల్లో 439 వికెట్లు, 125 వన్డేల్లో 196 వికెట్లు, 47 టీ20ల్లో 64 వికెట్లు సాధించాడు.
చదవండి: 'అందుకే ఐపీఎల్‌ నుంచి పక్కకు తప్పుకున్నా'
'రూట్‌ భయ్యా.. ఈసారి పిచ్‌ ఎలా ఉంటుందంటావు!'

మరిన్ని వార్తలు