కోవిడ్‌కు ఇష్టమైన వ్యక్తులు ఉండరు బాస్‌: స్టెయిన్‌

4 May, 2021 21:33 IST|Sakshi

ఐపీఎల్‌ వాయిదా తర్వాత ట్వీట్‌ చేసిన సఫారీ పేసర్‌

న్యూఢిల్లీ:  ఐపీఎల్‌-14 సీజన్‌ నిరవధికంగా వాయిదా పడటంతో సోషల్‌ మీడియా హోరెత్తిపోతోంది. కొందరు ఐపీఎల్‌ వాయిదాను సమర్థిస్తుంటే మరికొంతమంది మాత్రం మజాను మిస్సయ్యామని ఫీలవుతున్నారు. ఇలా మధ్యలో ఆగిపోవడంతో తమ జట్లు టైటిల్‌ గెలిచే చాన్స్‌ను మధ్యలోనే కోల్పోయామని మీమ్స్‌ ద్వారా ఊదరగొడుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ఎవరికి తోచింది వారు పోస్టులు పెడుతూ ఆడేసుకుంటున్నారు.  ఈ క్రమంలోనే ఓ అభిమాని దక్షిణాఫ్రికా పేసర్‌ డేల్‌ స్టైయిన్‌ను ట్యాగ్‌ చేసి మరీ ప్రశ్నలు సంధించాడు. 

2020 ఐపీఎల్‌లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించిన స్టైయిన్‌.. ఈఏడాది మాత్రం దూరంగా ఉన్నాడు. కానీ 2021 సీజన్‌ పాకిస్థాన్‌ ప్రీమియర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో మాత్రం పాల్గొన్నాడు. కాగా, మార్చి నెలలో పీఎస్‌ఎల్‌ కరోనా కారణంగా ఆగిపోవడంతో గత ఐపీఎల్‌ సీజన్‌ను కోడ్‌ చేస్తూ ఒక అభిమాని ట్వీట్‌ చేశాడు. స్టెయిన్‌ ఇప్పుడు చెప్పు పీఎస్‌ఎల్‌-ఐపీఎల్‌లో ఏది ఉత్తమం. ఏ టోర్నీని సమర్ధవంతంగా నిర్వహించారో వాస్తవం తెలుసుకో స్టెయిన్‌. అందుకు తగినంత సమయం కూడా ఉంది అని మార్చి 4వ తేదీన ట్వీట్‌ చేశాడు. అప్పుడు కేవలం నువ్వు చాలా సరదా మనిషివి అంటూ స్పందించిన స్టెయిన్‌.. తాజాగా ఐపీఎల్‌ వాయిదా పడిన తర్వాత మళ్లీ ట్వీట్‌ చేశాడు. కోవిడ్‌ లెక్కచేయదు.. దానికి ఎవరూ ఇష్టమైన వ్యక్తులు ఉండరు’ అని ట్వీట్‌ చేశాడు. సదరు అభిమానికి సమయం చూసుకుని మరీ రిప్లై ఇచ్చినట్లు స్టెయిన్‌కు మరొకసారి ట్రోలింగ్‌ బారిన పడే అవకాశం లేకపోలేదు.

మరిన్ని వార్తలు