Dallas Open: చరిత్ర సృష్టించిన యిబింగ్‌.. టైటిల్‌ గెలిచిన తొలి చైనీయుడిగా..

13 Feb, 2023 08:16 IST|Sakshi
చరిత్ర సృష్టించిన వు యిబింగ్‌(PC: ATP)

ATP Tour- Dallas Open: ఏటీపీ టైటిల్‌ గెలిచిన తొలి చైనీయుడిగా వు యిబింగ్‌ చరిత్ర సృష్టించాడు. డాలస్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టెన్నిస్‌ టోర్నీ ఫైనల్లో జాన్‌ ఇస్నర్‌ను ఓడించి విజేతగా అవతరించాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్‌ పోరులో యిబింగ్‌ 6-7(4) 7-6(3) 7-6(12) తేడాతో అమెరికాకు చెందిన జాన్‌ను ఓడించాడు. తద్వారా డాలస్‌ ఓపెన్‌ ట్రోఫీ నెగ్గి రికార్డులకెక్కాడు.

మీ వల్లే ఇదంతా అంటూ భావోద్వేగం
ఈ సందర్భంగా యిబింగ్‌ మాట్లాడుతూ.. ‘‘నా దేశం గర్వించదగ్గ రీతిలో ఈరోజు నేనిక్కడ చరిత్ర సృష్టించాను. నాకు చాలా చాలా సంతోషంగా, గర్వంగానూ ఉంది. నన్ను ఇక్కడి వరకు తీసుకువచ్చిన నా అభిమానులు, సహాయక సిబ్బంది ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు.

మీరు లేకుండా ఇదంతా సాధ్యమయ్యేదే కాదు’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక రన్నరప్‌గా నిలిచిన జాన్‌..‘ ఎంతగా పోరాడినా ఒక్కోసారి చేదు అనుభవాలు తప్పవు. యిబింగ్‌ మాత్రం చాలా బాగా ఆడాడు. అతడి ప్రతిభ అమోఘం’’ అని ప్రశంసించాడు.

ఒకే ఒక్కడు
కాగా మహిళల టెన్నిస్‌లో చైనా నుంచి గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్స్‌ ఉన్నా... పురుషుల టెన్నిస్‌లో మాత్రం ఇప్పటివరకు ఒక్కరు కూడా కనీసం ఏటీపీ టోర్నీలోనూ ఫైనల్‌కు కూడా చేరుకోలేకపోయారు. అయితే డాలస్‌ ఓపెన్‌లో 23 ఏళ్ల యిబింగ్‌ వు ఈ లోటును తీర్చాడు.

ఈ టోర్నీ సెమీఫైనల్లో 97వ ర్యాంకర్‌ యిబింగ్‌ వు 6–7 (3/7), 7–5, 6–4తో 8వ ర్యాంకర్‌ టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)ను ఓడించి ఏటీపీ టోర్నీలో ఫైనల్‌ చేరిన తొలి చైనా ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.  ఇదే జోష్‌లో.. ఫైనల్లోనూ సత్తాచాటి సరికొత్త చరిత్రకు నాంది పలికాడు.

చదవండి: Womens T20 World Cup 2023: మన అమ్మాయిలు... అదరగొట్టారు

మరిన్ని వార్తలు