Dani Alves Arrest: '22 ఏళ్ల పరిచయం.. కచ్చితంగా తప్పు చేసి ఉండడు'

25 Jan, 2023 13:01 IST|Sakshi
బ్రెజిల్‌ స్టార్‌ డానీ అల్వెస్‌; ఇన్‌సెట్‌లో అతని మాజీ భార్య

లైంగిక వేధింపుల కేసులో బ్రెజిల్‌ స్టార్‌, సీనియర్‌ ఫుట్‌బాలర్‌ డానీ అల్వెస్‌ను పోలీసులు గత వారం అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్త బ్రెజిల్‌తో పాటు యావత్‌ ఫుట్‌బాల్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆటను విపరీతంగా ప్రేమించే డానీ అల్వెస్‌లో ఇలాంటి కోణం కూడా ఉందా అని అభిమానులు నివ్వెరపోయారు. అయితే అతనిపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలేవరకు బెయిల్‌ ఇవ్వొద్దని స్పానిష్‌ కోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం డానీ అల్వెస్‌ పోలీసుల కస్టడీలో ఉన్నాడు.


ఇదిలా ఉండగా.. డానీ అల్వెస్‌ మాజీ భార్య డానా డినోర్హా మాత్రం అతనికి మద్దతుగా నిలబడింది. ఒక టెలివిజన్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె మాట్లాడుతూ.. ''డానీ ఈ పని చేశాడంటే నేను నమ్మను. ఎందుకంటే మా ఇద్దరికి 22 ఏళ్ల పరిచయం ఉంది. 10 ఏళ్ల పాటు కలిసి జీవించాం. అతని వ్యక్తిగత జీవితం ఎలా సాగిందన్న దానిపై నాకు పూర్తి క్లారిటీ ఉంది. కచ్చితంగా తప్పు చేసి ఉండడన్న నమ్మకం నాకుంది. అయితే డానీ అల్వెస్‌ అరెస్ట్‌ నన్ను, నా పిల్లలను మానసిక ఒత్తిడిలోకి నెట్టేసింది. మాకు ఇది కష్టకాలం కావొచ్చు.. అతను నిర్దోషిగా బయటకు వస్తాడని మాత్రం చెప్పగలను. డానీ అల్వెస్‌ తరపు లాయర్‌ను సంప్రదించా. కేసుపై వర్క్‌ చేస్తున్నట్లు ఆమె చెప్పినట్లు''  తెలిపింది. 

డానీ అల్వెస్‌ అరెస్ట్‌ విషయానికి వస్తే.. డిసెంబ‌ర్ 31న స్పెయిన్‌లో బార్సిలోనా నైట్ క్ల‌బ్‌లో ఒక మ‌హిళ ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించినట్లు తెలిసింది. ఆమె అనుమ‌తి లేకుండా లోదుస్తుల్లో చేతులు పెట్టాడు. ఈ విష‌యాన్ని స్పానిష్ మీడియా కథనంగా ప్రసారం చేసింది. ఆ మ‌హిళ కూడా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో డానీపై కేసు న‌మోదు చేశారు.

అయితే అల్వెస్‌ మాత్రం''ఆ స‌మ‌యంలో తాను ఆ క్ల‌బ్‌లో కొంత‌మందితో క‌లిసి ఉన్నాన‌ని, కానీ తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని ఈ ఫుట్‌బాల‌ర్ తెలిపాడు. నేను డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాను. అంతేత‌ప్ప ఇత‌రులకు ఏ ఇబ్బంది క‌లిగించ‌లేదు. ఆ మ‌హిళ ఎవ‌రో నాకు తెలియ‌దు. అలాంట‌ప్పుడు నేను ఆమెతో అస‌భ్య‌క‌రంగా ఎలా ప్ర‌వ‌ర్తించ‌గ‌ల‌నని'' పోలీసుల విచారణలో పేర్కొన్నాడు.

బ్రెజిల్‌ తరపున 2006లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన డానీ అల్వెస్‌ జట్టు తరపున 126 మ్యాచ్‌లు ఆడి ఎనిమిది గోల్స్‌ చేశాడు.ఇక 2022లో ఖ‌త‌ర్‌లో జ‌రిగిన‌ ఫిఫి వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడిన బ్రెజిల్ జ‌ట్టులో డానీ స‌భ్యుడు. క్వార్ట‌ర్ ఫైన‌ల్లో కామెరూన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో కెప్టెన్‌గా వ్య‌వ‌హరించాడు. బ్రెజిల్ త‌ర‌ఫున‌ వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఆడిన పెద్ద వ‌య‌స్కుడిగా డానీ గుర్తింపు సాధించాడు. ఇక 2008 నుంచి 2016 వరకు బార్సిలోనా క్లబ్‌కు ఆడిన డానీ 2021-22 సీజన్‌లో స్పానిష్‌ క్లబ్‌కు ఆడాడు. ప్రస్తుతం మెక్సికన్‌ క్లబ్‌ అయిన పుమాస్‌ యూనమ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.‌

చదవండి: లైంగిక వేధింపులు.. కటకటాల్లో స్టార్‌ ఫుట్‌బాలర్‌

ఫుట్‌బాల్‌ చరిత్రలోనే తొలిసారి..

మరిన్ని వార్తలు