Daniil Medvedev: గెలిచిన ఆనందం లేకుండా చేశారు.. ప్లేయర్‌ భావోద్వేగం

20 Jan, 2022 20:04 IST|Sakshi

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో పరుషుల ప్రపంచ నెంబర్‌ 2 ఆటగాడు డేనియల్‌ మెద్వదెవ్‌కు వింత అనుభవం ఎదురైంది. మ్యాచ్‌ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు పదేపదే మెద్వదేవ్‌ను తమ మాటలతో అవమానపరచడం అతన్ని బాధించింది. ఈ విషయాన్ని మెద్వదేవ్‌ మ్యాచ్‌ ముగిసిన అనంతరం కోర్టులో కామెంటేటర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో  పేర్కొన్నాడు.

''మ్యాచ్‌ను చూడడానికి వచ్చిన ప్రేక్షకులకు లో ఐక్యూ. ఒక క్రీడాకారుడితో ఎలా ప్రవర్తించాలన్న కనీస పరిజ్ఞానం లేదు. ఒకప్పుడు నేను తెలిసి తెలియకుండా చేసిన తప్పుకు ఇలా అవమానించడం కరెక్టు కాదు. ఆటగాళ్లకు కాస్త గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. మనషులమన్న సంగతి మరిచి రోబోల్లా ప్రవర్తించారు..'' అంటూ భావోద్వేగంతో చెప్పుకొచ్చాడు. 

కొన్నేళ్ల క్రితం యూఎస్‌ ఓపెన్‌లో ఫైనల్‌ చేరిన క్రమంలో డేనియల్‌ మెద్వదేవ్‌ మ్యాచ్‌ చూడడానికి వచ్చిన ప్రేక్షకులకు వింత అనుభవం చూపించాడు. మ్యాచ్‌ సమయంలో గట్టిగట్టిగా అరుస్తూ.. తన చర్యలతో ప్రేక్షకులకు కాస్త విసుగు పుట్టించాడు. అప్పట్లో ఈ ఘటన మెద్వదేవ్‌ను విలన్‌గా మార్చేసింది. తాజాగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌లో రెండోరౌండ్‌ మ్యాచ్‌లో లోకల్‌ ఆటగాడు నిక్‌ కిర్గియోస్‌తో తలపడ్డాడు. మ్యాచ్‌ ఆడుతున్నంతసేపు నిక్‌ కిర్గియోస్‌ పదే పదే ప్రేక్షకుల వైపు చూస్తూ మెద్వదేవ్‌ను రెచ్చగొట్టండంటూ ఎంకరేజ్‌ చేయడం విశేషం. మ్యాచ్‌ ముగిసేవరకు సైలెంట్‌గా ఉన్న మెద్వదేవ్‌... ఆ తర్వాత కామెంటరీ ఇంటర్వ్యూలో తన ఆగ్రహాన్ని ఒక్కసారిగా వెళ్లగక్కాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.


ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. డేనియల్‌ మెద్వదేవ్‌ రెండో రౌండ్‌లో నిక్‌ కిర్గియోస్‌పై 7-6, 6-4,4-6,6-2తో ఓడించి మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. ముర్రే రెండో రౌండ్‌లోనే వైదొలగడంతో.. నాదల్‌ తర్వాత మెద్వదేవ్‌ టైటిల్‌ ఫెవరెట్‌గా కనిపిస్తున్నాడు. కాగా మెద్వదేవ్‌ 2021 యూఎస్‌ ఓపెన్‌ విజేత అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. గతేడాది యూఎస్‌ ఓపెన్‌ గెలిచి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ అందుకునన్న మెద్వదేవ్‌ కెరీర్‌లో 13 ఏటీపీ టూర్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ ఉన్నాయి. 

మరిన్ని వార్తలు