మెద్వెదేవ్‌ మెరిసె...

24 Nov, 2020 05:29 IST|Sakshi
డొమినిక్‌ థీమ్, డానిల్‌ మెద్వెదేవ్

ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీ చాంపియన్‌గా రష్యా ప్లేయర్‌

ఫైనల్లో డొమినిక్‌ థీమ్‌పై నెగ్గిన మెద్వెదేవ్‌

ఈ టోర్నీ చరిత్రలో ప్రపంచ టాప్‌–3 ర్యాంకర్లను ఓడించిన తొలి క్రీడాకారుడిగా ఘనత

రూ. 11 కోట్ల 58 లక్షల ప్రైజ్‌మనీ సొంతం  

లండన్‌: ప్రపంచ నంబర్‌వన్‌ ప్లేయర్‌ జొకోవిచ్‌పై... 20 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన రాఫెల్‌ నాదల్‌పై తాను సాధించిన విజయాలు గాలివాటమేమీ కాదని రష్యా టెన్నిస్‌ నయాతార డానిల్‌ మెద్వెదేవ్‌ నిరూపించాడు.
పురుషుల టెన్నిస్‌ సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ ఏటీపీ ఫైనల్స్‌లో 24 ఏళ్ల మెద్వెదేవ్‌ చాంపియన్‌గా అవతరించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్‌ మెద్వెదేవ్‌ 4–6, 7–6 (7/2), 6–4తో ప్రపంచ మూడో ర్యాంకర్, ఈ ఏడాది యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా)ను ఓడించాడు. ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీలో ‘బెస్ట్‌ ఆఫ్‌ త్రీ సెట్స్‌’ ప్రవేశపెట్టాక సుదీర్ఘంగా సాగిన ఫైనల్‌ ఇదే కావడం విశేషం. ఈ ఏడాదితో లండన్‌లో ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీకి తెరపడింది. వచ్చే ఏడాది నుంచి ఇటలీలోని ట్యూరిన్‌లో ఈ మెగా టోర్నీ జరుగుతుంది.  

► 2 గంటల 43 నిమిషాలపాటు సాగిన ఈ తుది సమరంలో 6 అడుగుల 6 అంగుళాల ఎత్తు, 83 కేజీల బరువున్న మెద్వెదేవ్‌ 12 ఏస్‌లు సంధించి, మూడు డబుల్‌ ఫాల్ట్‌లు చేశాడు. తొలి సెట్‌ కోల్పోయి, రెండో సెట్‌ టైబ్రేక్‌లో 0–2తో వెనుకబడిన మెద్వెదేవ్‌ వరుసగా ఏడు పాయింట్లు గెలిచి టైబ్రేక్‌ను 7–2తో నెగ్గి రెండో సెట్‌ను దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో సెట్‌లో ఐదో గేమ్‌లో థీమ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసిన మెద్వెదేవ్‌ తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 4–2తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత కూడా తన సర్వీస్‌లను కాపాడుకున్న ఈ రష్యా ప్లేయర్‌ చివరకు 6–4తో మూడో సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. దాంతో థీమ్‌ వరుసగా రెండో ఏడాదీ ఈ టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.  

► ఈ టోర్నీలో అజేయంగా నిలిచి టైటిల్‌ నెగ్గినందుకుగాను మెద్వెదేవ్‌కు 15 లక్షల 64 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 11 కోట్ల 58 లక్షలు)తోపాటు 1500 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. రన్నరప్‌గా నిలిచిన డొమినిక్‌ థీమ్‌కు 8 లక్షల 61 వేల డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 6 కోట్ల 37 లక్షలు)తోపాటు 800 ర్యాం కింగ్‌ పాయింట్లు దక్కాయి.

► 50 ఏళ్ల ఈ టోర్నీ చరిత్రలో ఏకకాలంలో ప్రపంచ నంబర్‌వన్, నంబర్‌–2, నంబర్‌–3 ఆటగాళ్లను ఓడించి విజేతగా నిలిచిన తొలి ప్లేయర్‌గా మెద్వెదేవ్‌ గుర్తింపు పొందాడు. ఈ టోర్నీలో మెద్వెదేవ్‌ లీగ్‌ దశలో వరల్డ్‌ నంబర్‌వన్‌ జొకోవిచ్‌ (సెర్బియా)పై, సెమీఫైనల్లో రెండో ర్యాంకర్‌ రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)పై, ఫైనల్లో మూడో ర్యాంకర్‌ థీమ్‌పై గెలిచాడు.  

► నికొలాయ్‌ డెవిడెంకో (2009) తర్వాత ఏటీపీ ఫైనల్స్‌ టైటిల్‌ నెగ్గిన రెండో రష్యా ప్లేయర్‌ మెద్వెదేవ్‌.

► ఓవరాల్‌గా అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) ఒకే టోర్నీలో ఏకకాలంలో వరల్డ్‌ నంబర్‌వన్, నంబర్‌–2, నంబర్‌–3 ఆటగాళ్లను ఓడించిన నాలుగో ప్లేయర్‌ మెద్వెదేవ్‌. గతంలో నల్బందియాన్‌ (అర్జెంటీనా–2007 మాడ్రిడ్‌ ఓపెన్‌లో), జొకోవిచ్‌ (సెర్బియా–2007 మాంట్రియల్‌ ఓపెన్‌లో), బోరిస్‌ బెకర్‌ (జర్మనీ–1994 స్టాక్‌హోమ్‌ ఓపెన్‌లో) మాత్రమే ఈ ఘనత సాధించారు.  

► ఏటీపీ ఫైనల్స్‌ టోర్నీలో వరుసగా ఆరో ఏడాది కొత్త చాంపియన్‌ అవతరించాడు. ఈ టోర్నీలో ఇలా జరగడం ఇది రెండోసారి. మొదటిసారి 1974 నుంచి 1979 వరకు వరుసగా ఆరేళ్లు కొత్త విజేత వచ్చాడు.  

ఈ విజయం నాకెంతో ప్రత్యేకం.  శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉన్నపుడు నేను ఎంత గొప్ప ఫలితాలు సాధించగలనో ఈ టైటిల్‌ ద్వారా నిరూపితమైంది. ఈ గెలుపు భవిష్యత్‌లో మరిన్ని మేటి విజయాలకు ప్రేరణగా నిలుస్తుందని నమ్ముతున్నాను.
–మెద్వెదేవ్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా