మెద్వెదెవ్‌ మొదటిసారి...

20 Feb, 2021 04:30 IST|Sakshi

గ్రాండ్‌ స్లామ్‌ ఫైనల్‌ చేరిన రష్యన్‌ స్టార్‌ 

సెమీస్‌లో సిట్సిపాస్‌పై విజయం  

రేపు తుది పోరులో జొకోవిచ్‌తో ఢీ

మెల్‌బోర్న్‌: రష్యా ఆటగాడు, నాలుగో సీడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రపంచ నంబర్‌వన్, సెర్బియన్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌తో అమీతుమీకి అర్హత సాధించాడు. ఆదివారం వీరిద్దరి మధ్య పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ పోరు జరుగనుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో మెద్వెదెవ్‌ 6–4, 6–2, 7–5తో ఐదోసీడ్‌ స్టెఫానోస్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌)పై వరుస సెట్లలో గెలుపొందాడు. 25 ఏళ్ల మెద్వెదెవ్‌కు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కానుంది. గత నాలుగేళ్లుగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడుతున్న ఈ రష్యన్‌ స్టార్‌ ఏనాడు నాలుగోరౌండ్‌నే అధిగమించలేకపోయాడు.

మొత్తం గ్రాండ్‌స్లామ్‌ ఈవెంట్లలో అతని అత్యుత్తమ ప్రదర్శన యూఎస్‌ ఓపెన్‌ (2020)లో సెమీస్‌ చేరడమే! ఈ సారి మాత్రం మెల్‌బోర్న్‌లో మరో అడుగు ముందుకేశాడు. టైటిల్‌ దారిన పడ్డాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మెద్వెదెవ్‌ ప్రతీ సెట్‌లోనూ పైచేయి సాధించాడు. రెండో సెట్‌ను అలవోకగా గెలుచుకున్న నాలుగో సీడ్‌ ఆటగాడికి చివరి సెట్‌లో ప్రత్యర్థి సిట్సిపాస్‌ నుంచి కాస్త ప్రతిఘటన ఎదురైంది. 5–5 వద్ద సర్వీస్‌ను నిలబెట్టుకున్న మెద్వెదెవ్‌ తర్వాత గేమ్‌లో సిట్సిపాస్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 6–5తో అధిక్యంలోకి వచ్చాడు. మరుసటి గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకోవడంతో 7–5 స్కోరుతో సెట్‌తో పాటు మ్యాచ్‌ గెలిచాడు.

ఈ మ్యాచ్‌లో రష్యన్‌ స్టార్‌ ఏస్‌లతో చెలరేగాడు. మూడు సెట్ల ఆటలో అతను 17 ఏస్‌లు సంధించగా... ప్రత్యర్థి 3 ఏస్‌లకే పరిమితమయ్యాడు. 21 అనవసర తప్పిదాలు చేసిన మెద్వెదెవ్‌ 46 విన్నర్లు కొట్టాడు. మరోవైపు సిట్సిపాస్‌ 30 అనవసర తప్పిదాలు చేశాడు. 2 గంటల 09 నిమిషాల్లోనే సెమీస్‌ మ్యాచ్‌ను సునాయాసంగా ముగించాడు. అయితే రష్యన్‌ ఆటగాడికి  ఫైనల్‌ మాత్రం కొండను ఢీకొట్టడమే! ఎందుకంటే సెర్బియన్‌ స్టార్‌ జొకోవిచ్‌ ఖాతాలో 17 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఎనిమిది టైటిళ్లను ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లోనే గెలవడం మరో విశేషం. ఇంతటి మేరునగధీరుడ్ని తొలిసారి ఫైనల్‌ చేరిన మెద్వెదెవ్‌ ఏ మేరకు ఎదుర్కొంటాడో ఆదివారం జరిగే ఫైనల్లో చూడాలి.

>
మరిన్ని వార్తలు