పీసీబీని బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు

18 May, 2021 17:34 IST|Sakshi

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ పాక్ క్రికెట్ బోర్డు పెద్దల్ని బ్లాక్ మెయిల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా విమర్శించాడు.అంతర్జాతీయ క్రికెట్‌కి గత ఏడాది గుడ్‌బై చెప్పిన అతను ఐపీఎల్‌లో ఆడేందుకు బ్రిటీష్ సిటిజన్‌షిప్ కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించాడు.

ఈ సందర్భంగా అమీర్‌ వ్యవహారంపై కనేరియా స్పందిస్తూ.. '' ప్రతి ఒక్కరూ వాళ్ల అభిప్రాయాన్ని చెప్పొచ్చు. ఇక్కడ మహ్మద్ అమీర్‌ని నేనేమీ తప్పుబట్టడం లేదు. కానీ.. అతను తన స్టేట్‌మెంట్స్ ద్వారా ఇతరుల్ని బ్లాక్ మెయిల్‌ చేస్తున్నాడనిపిస్తోంది.  ఈ క్రమంలో ఇంగ్లండ్‌ వెళ్లి.. అక్కడ బ్రిటీష్ సిటిజన్‌షిప్‌ని తీసుకుని ఐపీఎల్‌లో ఆడతానని చెప్తున్నాడు. దీనిబట్టి అతని ఆలోచన తీరుని  అర్థం చేసుకోవచ్చు'' అని చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ అజహర్ మహ్మద్ కూడా ఇలానే బ్రిటీష్ సిటిజన్‌షిప్ తీసుకుని.. ఐపీఎల్‌లో కింగ్స్ పంజాబ్ తరఫున గతంలో మ్యాచ్‌లు ఆడాడు.

2009లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మహ్మద్ అమీర్.. ఏడాది వ్యవధిలోనే స్ఫాట్ ఫిక్సింగ్‌కి పాల్పడి ఐదేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్ ఆడుతూ  ఫిక్సింగ్‌కి పాల్పడటంతో అక్కడే జైల్లో కూడా కొన్ని రోజులు గడిపాడు.  నిషేధం తర్వాత మళ్లీ పాక్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అమీర్.. అంచనాలకి మించి రాణించాడు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్‌ని పాక్ ఓడించి టోర్నీ విజేతగా నిలవడంలో అమీర్ క్రియాశీలక పాత్ర పోషించాడు. కానీ.. గత ఏడాది పీసీబీ తనని మెంటల్ టార్చర్‌కి గురిచేస్తోందని వాపోయిన అమీర్.. ఎవరూ ఊహించని రీతిలో 29 ఏళ్లకే ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పేశాడు. కాగా పాక్‌ తరపున అమీర్ 36 టెస్టుల్లో 119 వికెట్లు, 61 వన్డేల్లో 81 వికెట్లు, 50 టీ20ల్లో 59 వికెట్లు తీశాడు.
చదవండి: ‘ఆ రెండు టెస్టుల్లో ఫిక్సింగ్‌ జరగలేదు’

టీమిండియా మహిళా క్రికెటర్లపై బీసీసీఐ వివక్ష!

మరిన్ని వార్తలు