ఆమిర్‌కు ఇచ్చిన విలువ నాకెందుకు ఇవ్వలేదు

18 Dec, 2020 12:12 IST|Sakshi

కరాచీ : పాకిస్తాన్‌ పేసర్‌ మొహమ్మద్‌ ఆమిర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గురువారం రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) పెట్టే మానసిక క్షోభ భరించలేకే క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు  వీడియో సందేశంలో పేర్కొన్నాడు. ఆమిర్‌ రిటైర్మెంట్‌ నిర్ణయం తర్వాత  షోయబ్‌ అక్తర్‌ సహా పలువురు మాజీ క్రికెటర్లు అతనికి మద్దతుగా నిలిచారు. అయితే పాక్‌ మాజీ స్పిన్నర్‌ దానిష్‌ కనేరియా ఆమిర్‌కు వస్తున్న మద్దతును తప్పుబడుతూ ట్విటర్‌లో కామెంట్‌ చేశాడు.(చదవండి : మెంటల్‌ టార్చర్‌.. అందుకే ఇలా‌)

'పీసీబీ మెంటల్‌ టార్చర్‌ భరించలేక రిటైర్మెంట్‌ ప‍్రకటిస్తున్నట్లు ఆమిర్‌ ప్రకటించాడు. అది ఆమిర్‌ వ్యక్తిగత నిర్ణయం.. అతని నిర్ణయాన్ని నేను తప్పుబట్టను. స్పాట్‌ ఫిక్సింగ్‌ తర్వాత దోషిగా తేలిన ఆమిర్‌ మళ్లీ పాక్‌కు క్రికెట్‌ ఆడాడు. అయితే పీసీబీ అదే ధోరణిలో అతను చూడడంతో ఇప్పుడు ఆటకు గుడ్‌బై చెప్పాడు. కానీ ఆమిర్‌ విషయంలో పీసీబీని తప్పుబడుతూ పలువురు మాజీ, స్టార్‌ క్రికెటర్లు మద్దతు పలికారు. గతంలో ఇదే పీసీబీ విషయంలో నాకు న్యాయం జరగాలని వారికి విజ్ఞప్తి చేశాను.. అప్పుడు నేను మతం కార్డును ఉపయోగించానన్న కారణంతో ఏ ఒక్క క్రికెటర్‌ మద్దతుగా నిలవలేదు. ఆమిర్‌కు ఇచ్చిన విలువలో కనీసం సగం ఇచ్చినా బాగుండు అనిపించిందంటూ' ట్వీట్‌ చేశాడు.(చదవండి : ఆ రికార్డుకు 51 ఏళ్లు పట్టింది)

2000వ సంవత్సరంలో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన దానిష్‌ కనేరియా పాక్‌ తరపున అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా నిలిచాడు. కనేరియా పాక్‌ తరపున 61 టెస్టుల్లో 261 వికెట్లు.. 18 వన్డేల్లో 15 వికెట్లు తీశాడు.  2012లో ఇంగ్లీష్‌ కౌంటీ క్రికెట్‌ ఆడుతుండగా.. దానిష్‌ కనేరియా మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని ఇంగ్లండ్ అండ్ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) అతడిపై జీవితకాల నిషేధం విధించింది. ఈసీబీ చర్యను సమర్థిస్తూ పీసీబీ కూడా కనేరియాపై నిషేధం విధించింది. దీంతో కనేరియా అప్పటినుంచీ ఎలాంటి క్రికెట్‌ ఆడడం లేదు. 2018లో ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ  స్పాట్‌ ఫిక్సింగ్‌ చేసినట్లు అంగీకరించాడు. అయినా పీసీబీ తనపై కనికరం చూపడం లేదంటూ చాలాసార్లు త‌న ఆవేదన వ్యక్తం చేశాడు. తాను హిందువు అయినందున పాక్‌ బోర్డు తన విషయంలో జోక్యం చేసుకోవట్లేదని బాహాటంగానే ఆరోపించాడు. ఈ విషయం అప్పుట్లో పెద్ద దుమారం రేపింది. కనేరియా వ్యాఖ్యలపై అప్పట్లో కొందరు పాక్‌ క్రికెటర్లు తప్పుబడుతూ విమర్శించారు.

మరిన్ని వార్తలు