ZIM vs IND: జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు అతడిని ఎందుకు ఎంపిక చేశారు..?

31 Jul, 2022 11:34 IST|Sakshi

జింబాబ్వేతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ శనివారం (జూలై 30) ప్రకటించింది. ఇక ఈ సిరీస్‌కు టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కావడంతో శిఖర్ ధావన్ మరోసారి జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అదే విధంగా యువ ఆటగాడు రాహుల్‌ త్రిపాఠికు తొలి సారి భారత వన్డే జట్టులో చోటు దక్కింది.

ఇక గాయం కారణంగా కొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్నచ యువ పేసర్‌ దీపక్‌ చాహర్‌ ఈ సిరీస్‌తో పునరాగమనం చేయనున్నాడు.  అదే సమయంలో అవేశ్‌ ఖాన్‌కు చోటు దక్కింది. ఈ  నేపథ్యంలో పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్ కనేరియా అసక్తికర వాఖ్యలు చేశాడు. జింబాబ్వేతో వన్డే సిరీస్‌కు పేసర్‌ అవేశ్ ఖాన్‌ను ఎంపిక చేయడాన్ని డానిష్ కనేరియా ప్రధానంగా తప్పుబట్టాడు.

"అవేష్‌ ఖాన్‌ తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయినప్పటికీ అతడిని సెలక్టర్లు ఎందుకు ఎంపిక చేశారో నాకు అర్దం కావడం లేదు. ఈ సిరీస్‌కు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ వంటి సీనియర్ పేసర్లకు భారత్ విశ్రాంతినిచ్చింది.  ఇక భారత స్పీడ్‌ స్టార్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ తన ఆరంభ మ్యాచ్‌ల్లో అంతగా రాణించలేకపోయాడు.

అయితే అవేశ్ ఖాన్‌ స్థానంలో ఉమ్రాన్‌కు మరో అవకాశం ఇవ్వాల్సింది. అదే విధంగా అద్భుతంగా రాణిస్తున్న అర్ష్‌దీప్ సింగ్ కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. ఈ నిర్ణయం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. జట్టు మేనేజ్‌మెంట్ అర్ష్‌దీప్‌కు మరిన్ని ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. తద్వారా అర్ష్‌దీప్ ఆటగాడిగా మరింత పరిణతి చెందుతాడు" అని కనేరియా పేర్కొన్నాడు.  కాగా,  అద్భుతంగా రాణిస్తున్న పేసర్‌ అర్షదీప్‌ సింగ్‌కు జట్టులో చోటు దక్కకపోవడం గమనార్హం.
చదవండి: భారత్‌కు టీ20 ప్రపంచకప్‌ అందించడమే నా అంతిమ లక్ష్యం: కార్తీక్‌

మరిన్ని వార్తలు