IND vs BAN: షకీబ్‌ బౌలింగ్‌ గురించి చిన్న పిల్లలకు తెలుసు! భారత బ్యాటర్లకు మాత్రం..

5 Dec, 2022 14:03 IST|Sakshi

బంగ్లాదేశ్‌తో తొలి వన్డేలో భారత జట్టు ఓటమిని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బ్యాటర్లు మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. అదే విధంగా కేఎల్‌ రాహుల్‌ కీలక సమయంలో క్యాచ్‌ జారవిడిచడం మ్యాచ్‌ ఫలితాన్నే మార్చేసింది. అయితే బంగ్లాదేశ్‌ వంటి చిన్న జట్టుపై ఓటమిని అభిమానులతో పాటు మాజీలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.

కొంత మంది టీమిండియాకు మద్దతుగా నిలుస్తుంటే.. మరి కొంత మంది విమర్శల వర్షం ​కురిపిస్తున్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ డానిష్ కనేరియా స్పందించాడు. బంగ్లాదేశ్‌ స్పిన్నర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ బౌలింగ్‌ను అర్ధం చేసుకోవడంలో భారత బ్యాటర్లు విఫలమయ్యారని విమర్శించాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన షకీబ్‌ బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

"షకీబ్ అల్ హసన్ అద్భుతంగా బౌలింగ్‌ చేయగలడు. ఈ మ్యాచ్‌లో కూడా రాణించాడు. అయితే అతడు చాలా ఏళ్లుగా జట్టుతో ఉన్నాడు. ఐపీఎల్‌ కూడా ఆడుతున్నాడు. అయినప్పటికీ అతడి బౌలింగ్‌ ఎలా ఉంటుందో, అతడిని ఎలా ఎదుర్కోవాలో భారత బ్యాటర్లకు ఇంకా అర్థం కాలేదా? వాళ్లెందుకిలా చేశారో తెలియదు.

ఇలాంటి సమయంలో బంతి పిచ్‌పై పడిన వెంటనే టర్న్‌ అవుతుందన్న విషయం చిన్న పిల్లలకు కూడా తెలుసు. కానీ టీమిండియా క్రికెటర్లు ఆ విషయం తెలుసుకో లేకపోయారు" అంటూ తన యూట్యూబ్‌ ఛానల్‌లో కనేరియా పేర్కొన్నాడు.
చదవండి: PAK vs ENG: పాకిస్తాన్‌ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్‌కు భారీ షాక్‌..

మరిన్ని వార్తలు