సజన్‌కు స్వర్ణం... వేదాంత్‌కు రజతం

17 Apr, 2022 05:51 IST|Sakshi

కొపెన్‌హగెన్‌ (డెన్మార్క్‌): డానిష్‌ ఓపెన్‌ అంతర్జాతీయ స్విమ్మింగ్‌ టోర్నమెంట్‌లో భారత స్విమ్మర్లు సజన్‌ ప్రకాశ్, వేదాంత్‌ మెరిశారు. పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ విభాగంలో కేరళకు చెందిన సజన్‌ ప్రకాశ్‌ స్వర్ణ పతకం సాధించగా... పురుషుల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్‌ విభాగంలో తమిళనాడుకు చెందిన వేదాంత్‌ రజత పతకం సొంతం చేసుకున్నాడు. సజన్‌ 200 మీటర్ల లక్ష్యాన్ని ఒక నిమిషం 59.27 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. సినీ నటుడు మాధవన్‌ కుమారుడైన వేదాంత్‌ 1500 మీటర్ల లక్ష్యాన్ని 15 నిమిషాల 57.86 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. 16 ఏళ్ల వేదాంత్‌ గత ఏడాది లాత్వియా ఓపెన్‌లో కాంస్యం నెగ్గగా... జాతీయ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో నాలుగు రజతాలు, మూడు కాంస్యాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు సాధించాడు.

మరిన్ని వార్తలు