దీనిని 'క్యాచ్‌ ఆఫ్‌ ది సమ్మర్'‌ అనొచ్చా..

23 Dec, 2020 11:10 IST|Sakshi

నేపియర్‌ : న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌ల మధ్య మంగళవారం జరిగిన మూడో టీ20లో కివీస్‌ సబ్‌స్టిట్యూట్‌ ఫీల్డర్‌ డారెల్‌ మిచెల్‌ ఒంటిచేత్తో అందుకున్న క్యాచ్‌ హైలెట్‌గా నిలిచింది. 6వ ఓవర్‌ వేసిన కుగ్గెలీజ్న్ బౌలింగ్‌లో పాక్‌ బ్యాట్స్‌మెన్‌ హైదర్‌ అలీ కవర్‌డ్రైవ్‌‌ మీదుగా షాట్‌ ఆడాడు. గ్యాప్‌లో వేచి ఉన్న మిచెల్‌ కొన్ని గజాలు వెనుకకు పరిగెత్తి  అమాంతం గాల్లోకి ఎగిరి ఒకపక్కగా డైవ్‌చేస్తూ అందుకున్నాడు. వాస్తవానికి అంతకముందు ఓవర్‌లో హైదర్‌ అలీ కొట్టిన షాట్‌ మార్టిన్‌ గప్టిల్‌ క్యాచ్‌ అందుకునే ప్రయత్నంలో గాయపడ్డాడు. దీంతో అతని స్థానంలో వచ్చిన మిచెల్‌ ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. ఇంకో విశేషమేంటంటే.. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన డారెల్‌ మిచెల్‌ మూడు క్యాచ్‌లు అందుకోగా.. ఆ మూడు వికెట్లు కుగ్గెలీజ్న్ బౌలింగ్‌లోనే రావడం విశేషం. ఈ వీడియోనూ ఐసీసీ తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. మిచెల్‌ అందుకున్నది 'క్యాచ్‌ ఆఫ్‌ ది సమ్మర్‌ అవునా.. కాదా మీరే చెప్పండి' అంటూ క్యాప్షన్‌ జత చేసింది. (చదవండి : ప్రేయసితో యువ క్రికెటర్‌ పెళ్లి)

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే పాకిస్తాన్‌ కివీస్‌పై 4 వికెట్ల తేడాతో గెలిచి క్లీన్‌స్వీప్‌ నుంచి తప్పించుకుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన న్యూజిలాండ్‌ సిరీస్‌ను 2–1తో దక్కించుకుంది.  తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 173 పరుగులు చేసింది. డేవన్‌ కాన్వే (45 బంతుల్లో 63; 7 ఫోర్లు, సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ జట్టులో..  తాత్కాలిక కెప్టెన్‌ మొహమ్మద్‌ రిజ్వాన్‌ (59 బంతుల్లో 89; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌కు తోడూ హఫీజ్‌ (29 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించడంతో 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. కాగా రెండు జట్ల మధ్య ఈనెల 26 నుంచి తొలి టెస్టు జరుగుతుంది. (చదవండి : ఒక్క ఓవర్‌.. ఐదు వికెట్లు.. సూపర్ కదా‌)

మరిన్ని వార్తలు