ఐపీఎల్‌లో ప్రత్యర్థులు.. అక్కడ మాత్రం మిత్రులు

24 Feb, 2021 19:48 IST|Sakshi

లండన్‌: ఆసీస్‌ విధ్వంసకర ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌, ఇంగ్లండ్‌ స్టార్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌.. విండీస్‌ విధ్వంసం ఆండీ రసెల్‌ ఒక జట్టుకు ఆడడం ఎప్పుడైనా చూశారా. అంతర్జాతీయంగా వేర్వేరు జట్లకు ఆడే వీరు ఐపీఎల్‌ సహా ఇతర లీగ్‌ల్లోనూ ప్రత్యర్థులుగా తలపడ్డారు. అయితే త్వరలోనే వీరు ముగ్గురు ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.. కాకపోతే  హండ్రెడ్‌ 2021 టోర్నమెంట్‌ వరకు ఆగాల్సిందే.

ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు సంయుక్తంగా హండ్రెడ్‌ 2021 టోర్నమెంట్‌ను నిర్వహించనున్నాయి. వాస్తవానికి గతేడాది జూన్‌లోనే ఈ టోర్నమెంట్‌ జరగాల్సింది. కానీ కరోనా మహమ్మారితో టోర్నీ నిర్వహణ వాయిదా పడింది. తాజాగా ఐపీఎల్‌ 2021 సీజన్‌ ముగిసిన తర్వాత జూలై 2021లో ఈ టోర్నీ ఆరంభం కానుంది. కాగా టోర్నీలో పురుషులతో పాటు మహిళల మ్యాచ్‌లు కూడా సమానంగా జరగనున్నాయి. హండ్రెడ్‌ 2021 పేరుతో నిర్వహించనున్న ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి. బర్మింగ్‌హమ్‌ ఫోనిక్స్‌, ట్రెంట్‌ రాకెట్స్‌, ఓవల్‌ ఇన్విసిబల్స్‌, సౌతర్న్‌ బ్రేవ్‌, లండన్‌ స్పిరిట్‌, వేల్ష్‌ ఫైర్‌, నార్తన్‌ సూపర్‌ చార్జర్స్‌, మాంచెస్టర్‌ ఒరిజనల్స్‌ టోర్నీలో జట్లుగా ఉండనున్నాయి.

కాగా జోఫ్రా ఆర్చర్‌, వార్నర్‌, ఆండీ రసెల్‌లు సౌతర్న్‌ బ్రేవ్‌లో ఆడనున్నారు. అయితే వార్నర్‌ గజ్జల్లో గాయం కారణంగా ఐపీఎల్‌ ఆడేది అనుమానంగా ఉంది. 6-9 నెలల విశ్రాంతి అవసరం అని స్వయంగా వార్నరే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్‌లో వార్నర్‌ ఎస్‌ఆర్‌హెచ్‌కు, ఆర్చర్‌ రాజస్తాన్‌ రాయల్స్‌కు, ఆండీ రసెల్‌ కేకేఆర్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే.
చదవండి: సన్‌రైజర్స్‌కు వార్నర్‌ షాక్‌ ఇవ్వనున్నాడా!

మరిన్ని వార్తలు