సిరాజ్‌కు సారీ చెప్పిన డేవిడ్‌ వార్నర్‌!

12 Jan, 2021 16:01 IST|Sakshi

సిడ్నీ: భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రసవత్తర టెస్టు సిరీస్‌ సమరంలో జాతివివక్ష వ్యాఖ్యలు కలవరం పుట్టించాయి. ఇప్పటికే పూర్తయిన వన్డే సిరీస్‌ను ఆతిథ్య జట్టు, టీ20 సిరీస్‌ను భారత్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టెస్టు సిరీస్‌ విషయానికి వస్తే తొలి టెస్టులో ఆస్ట్రేలియా, రెండో టెస్టులో భారత్‌ విజయం సాధించి సమంగా నిలిచాయి. ఈసమయంలో సిడ్నీ జరిగిన మూడో టెస్టు మూడో రోజున ఆస్ట్రేలియాకు చెందిన కొంతమంది ఆకతాయిలు బౌండరీ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న మహ్మద్‌ సిరాజ్‌పై జాతివివక్ష వ్యాఖ్యలు చేయడంతో టీమిండియా క్రికెట్‌ ఆస్ట్రేలియాకు ఫిర్యాదు చేసింది. నాలుగో రోజు కూడా అలాంటి సీనే రిపీట్‌ అయింది. ఈసారి బుమ్రాను జాతి వివక్ష వ్యాఖ్యలతో ఆసీస్‌ మూకలు ఇబ్బందులు పెట్టడంతో మరోసారి టీమిండియా ఫిర్యాదు చేయక తప్పలేదు. 

ఈ ఘటనపై తాజాగా ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ స్పందించాడు. జాతి వివక్ష వ్యాఖ్యలపై సిరాజ్‌కు, బుమ్రాకు, టీమిండియాకు క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఆయన వెల్లడించాడు. జాతి వివక్ష వ్యాఖ్యలపై విచారిస్తున్నానని అన్నాడు. అలాంటి వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాడు. భారత ఆటగాళ్లపై ఆకతాయిల వైఖరి తీవ్ర నిరాశకు గురి చేసిందని వాపోయాడు. నిందితులపై క్రికెట్‌ ఆస్ట్రేలియా చర్యలు తీసుకుటుందని స్పష్టం చేశాడు. మరోసారి అలాంటి ఘటనలు రిపీట్‌ కావని ఆశిస్తున్నట్టు వార్నర్‌ తన పోస్టులో చెప్పుకొచ్చాడు.
(చదవండి: 'అశ్విన్‌పై చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడుతున్నా')

గబ్బా స్టేడియంలో జరిగే ఫైనల్‌ టెస్టుకు రెడీ అవుతున్నామని పేర్కొన్నాడు. అలాగే, సిడ్నీ టెస్టులో గొప్పగా రాణించి మ్యాచ్‌ను నిలుపుకున్న భారత ఆటగాళ్ల పోరాట పటిమను వార్నర్‌ ప్రశంసించాడు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాగా ఆడుతున్నారని కొనియాడాడు. కాగా, జాతి వివక్ష వ్యాఖ్యలపై క్రికెట్‌ ఆస్ట్రేలియా సంజాయిషీ ఇచ్చుకుంది. మరోసారి అలా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని, ఆ ఆకతాయిలను గుర్తించి పోలీసులకు అప్పగిస్తామని హామీ ఇచ్చింది. ఐసీసీ కూడా జాతి వివక్ష వ్యాఖ్యల్ని ఉపేక్షించబోమని స్పష్టం చేసింది.

A post shared by David Warner (@davidwarner31)

మరిన్ని వార్తలు