SL VS AUS 4th ODI: 99 పరుగుల వద్ద స్టంపౌటైన వార్నర్‌‌.. వన్డే క్రికెట్‌ చరిత్రలో రెండో ఆటగాడిగా 

22 Jun, 2022 09:40 IST|Sakshi

కొలొంబో: సొంతగడ్డపై శ్రీలంక 30 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. 1992 తర్వాత తొలిసారి ఆ జట్టు స్వదేశంలో ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. మంగళవారం (జూన్‌ 21) జరిగిన నాలుగో వన్డేలో ఆసీస్‌ను 4 పరుగుల తేడాతో చిత్తు చేయడం ద్వారా 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఛేదనలో ఆసీస్‌  50 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటై లక్ష్యానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచిపోయింది. 

లంక జట్టులో చరిత్‌ అసలంక (106 బంతుల్లో 110; 10 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో సత్తా చాటగా, ధనంజయ డిసిల్వ (61 బంతుల్లో 60; 7 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో డేవిడ్‌ వార్నర్‌ (112 బంతుల్లో 99; 12 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా, చివర్లో ప్యాట్‌ కమిన్స్‌ (43 బంతుల్లో 35; 2 ఫోర్లు), కునెర్మన్‌ (12 బంతుల్లో 15; 3 ఫోర్లు) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 

వీవీఎస్‌ లక్ష్మణ్‌ సరసన వార్నర్‌
లంకతో జరిగిన నాలుగో వన్డేలో ఆసీస్‌ స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్ ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి బాధ్యతాయుతంగా ఆడిన వార్నర్‌ 99 పరుగుల వద్ద ధనంజయ డిసిల్వ బౌలింగ్‌లో స్టంప్‌ ఔటయ్యాడు. తద్వారా వన్డే క్రికెట్‌ చరిత్రలో 99 పరుగుల వద్ద స్టంప్‌ ఔట్‌ అయిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2002లో నాగ్‌పూర్‌ వేదికగా విండీస్‌తో జరిగిన వన్డేలో టీమిండియా ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఇలానే 99 పరుగుల వద్ద స్టంప్‌ ఔటయ్యాడు.  
చదవండి: ఆసీస్‌కు షాకిచ్చిన శ్రీలంక.. 30 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై సిరీస్‌ గెలుపు
   

మరిన్ని వార్తలు