IPL 2021: సెకండ్‌ ఫేజ్‌ ఆడడంపై డేవిడ్‌ వార్నర్‌ క్లారిటీ

10 Aug, 2021 18:39 IST|Sakshi

సిడ్నీ: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు ఆసీస్‌ విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ శుభవార్త అందించాడు. సెప్టెంబర్‌19 నుంచి మొదలుకానున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో అంచె పోటీలకు తాను అందుబాటులోకి వస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించాడు. యూఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్‌ సెకండ్‌ ఫేజ్‌లో తాను ఆడబోతున్నట్లు స్పష్టం చేశాడు. '' ఐ విల్‌ బి బ్యాక్‌.. అక్కడే మీ అందరిని కలుస్తా'' అంటూ కామెంట్‌ జత చేశాడు.

కాగా ఐపీఎల్‌ 2021 సీజన్‌ వాయిదా పడడానికి ముందు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి కేన్‌ విలియమ్స్‌న్‌కు పగ్గాలు అప్పగించింది. కెప్టెన్‌గా విలియమ్సన్‌ ఎంపికపై నెటిజన్లు ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యంను తప్పుబడుతూ ట్విటర్‌ వేదికగా విమర్శలు సంధించారు. దీనికి తోడూ కెప్టెన్‌ పదవి నుంచి తొలగించడమేగాక తర్వాతి మ్యాచ్‌కు వార్నర్‌ను పక్కనపెట్టారు. ఆ మ్యాచ్‌కు వార్నర్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాళ్లకు డ్రింక్స్‌ అందించడంపై పెద్ద వివాదమే చెలరేగింది. ఈ నేపథ్యంలో వార్నర్‌ ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆడడం ఇదే చివరిసారని వార్తలు వచ్చాయి. కరోనాతో వాయిదా పడిన ఐపీఎల్ రెండో అంచె పోటీలకు కూడా వార్నర్‌ దూరంగా ఉంటాడని అంతా భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వార్నర్‌ తాను ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో అంచె పోటీలు ఆడడంపై క్లారిటీ ఇచ్చేశాడు. ఏది ఏమైనా వార్నర్‌ ఐపీఎల్‌ ఆడడంపై క్లారిటీ ఇవ్వడంతో అభిమానుల్లో జోష్‌ పెరిగింది. కరోనాతో వాయిదా పడిన మిగతా లీగ్‌ మ్యాచ్‌లు సెప్టెంబర్‌ 19 నుంచి ఆరంభం కానున్నాయి. అక్టోబర్‌ 15న ఐపీఎల్‌ 14వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

A post shared by David Warner (@davidwarner31)

ఇక 2012లో డెక్కన్‌ చార్జర్స్‌ నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌గా పేరు మార్చుకొని బరిలోకి దిగిన ఆ జట్టుకు డారెన్‌ సామి, శిఖర్‌ ధావన్‌, కామెరున్‌ వైట్‌ లాంటి ఎంతో మంది ఆటగాళ్లు కెప్టెన్లుగా పనిచేశారు. అయితే 2015లో డేవిడ్‌ వార్నర్‌ ఆ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేసిన తర్వాత ఆ జట్టు తలరాత మారిపోయింది. 2016లో వార్నర్‌ కెప్టెన్సీలోనే ఐపీఎల్‌ టైటిల్‌ను కొల్లగొట్టింది. ఆ సీజన్‌లో వార్నర్‌ బ్యాటింగ్‌లో అసాధారణ ఆటతీరుతో అదరగొట్టి ఒంటిచేత్తో జట్టుకు టైటిల్‌ను అందించాడు.

అప్పటినుంచి 2018 సీజన్‌ మినహా మిగతా అన్ని సీజన్లకు కెప్టెన్‌గా పనిచేసిన వార్నర్‌ ప్రతీసారి ఫ్లేఆఫ్‌కు తీసుకురావడం విశేషం. ఇక బాల్‌ టాంపరింగ్‌ వివాదంతో ఏడాది నిషేదం ఎదుర్కొన్న వార్నర్‌ 2018 ఐపీఎల్‌ సీజన్‌కు దూరం కావడంతో అతని స్థానంలో విలియమ్సన్‌ కెప్టెన్‌గా పనిచేశాడు. అయితే ఆ ఏడాది విలియమ్సన్‌ అద్బుత కెప్టెన్సీకి తోడూ ఆటగాళ్లు కూడా విశేషంగా రాణించడంతో ఫైనల్‌కు వచ్చింది. అయితే ఫైనల్లో సీఎస్‌కే చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది. అయితే ఈ సీజన్‌ ఆరంభంలో విలియమ్సన్‌ నాలుగు మ్యాచ్‌లకు దూరంగా ఉండడం.. వార్నర్‌ కెప్టెన్సీలో విఫలమవడంతో పాటు బ్యాటింగ్‌లోనూ అంతంత ప్రదర్శన నమోదు చేయడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్సీ మార్పును పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ వరుస ఓటములతో నిరాశ పరిచింది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క విజయం నమోదు చేసి.. ఐదు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఆఖరిస్థానంలో నిలిచింది. 

మరిన్ని వార్తలు