ఐపీఎల్‌ చరిత్రలో ‘గ్రేటెస్ట్‌ వార్నర్‌’

4 Oct, 2020 16:29 IST|Sakshi
డేవిడ్‌ వార్నర్‌(ఫోటో కర్టీసీ: ఐఏఎన్‌ఎస్‌)

షార్జా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) అంటే సీనియర్‌ క్రికెటర్లకు, యువ క్రికెటర్లకు ఒక చక్కటి వేదిక. ఫామ్‌లో లేని సీనియర్లు తమ ఫామ్‌ను నిరూపించుకోవడానికి ఈ లీగ్‌ను ఉపయోగించుకుంటే, వెలుగులోకి రావడానికి యువ క్రికెటర్లు తహతహలాడిపోతూ ఉంటారు. ఐపీఎల్‌కు ఆడితే తమ లైఫ్‌ సెట్‌ అయిపోయినట్లేననే భావన ప్రతీ ఒక్క క్రికెటర్‌లో ఉంటుంది. అందుకే దీన్ని క్యాష్‌ రిచ్‌ లీగ్‌ అని కూడా పిలుస్తూ ఉంటాం. కాగా, ఐపీఎల్‌ చరిత్రలో బ్యాట్స్‌మెన్‌ పరంగా టాప్‌-5లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ లీగ్‌ హిస్టరీలో వార్నర్‌ గ్రేటెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు.  అత్యధిక పరుగులు చేసిన టాప్‌-5 బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో వార్నర్‌ నాల్గో స్థానంలో ఉన్నా, యావరేజ్‌ పరంగా కానీ, స్టైక్‌రేట్‌ల్లో తొలి స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో వార్నర్‌ యావరేజ్‌ 42.66గా ఉండగా, స్టైక్‌రేట్‌ 141.66గా ఉంది. (చదవండి: పేరు మాత్రమే పంత్‌.. కానీ పనులు మాత్రం)

టాప్‌-5 బ్యాట్స్‌మెన్‌ జాబితాలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఆర్సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ముందంజలో ఉండగా, సురేశ్‌ రైనా రెండో స్థానంలో రోహిత్‌ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. ఇక‍్కడ వార్నర్‌ నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు. వీరిలో వార్నర్‌ ఒక్కడే ఎక్కువ యావరేజ్, స్టైక్‌రేట్‌‌ కల్గిన ఆటగాడు. కోహ్లి, రైనా, రోహిత్‌లు 170కి పైగా మ్యాచ్‌లు ఆడగా, వార్నర్‌ 130 ఐపీఎల్‌ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కోహ్లి 172 మ్యాచ్‌లు ఆడి 5,430 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 36 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇక్కడ కోహ్లి యావరేజ్‌ 37.19 ఉండగా, స్టైక్‌రేట్‌ 131.12గా ఉంది. ఇక రైనా 189 మ్యాచ్‌ల్లో 5,368 పరుగులు నమోదు చేశాడు. ఒక సెంచరీ, 38 హాఫ్‌ సెంచరీలతో ఈ పరుగులు చేశాడు రైనా. అతని యావరేజ్‌ 33.34గా ఉండగా, స్టైక్‌రేట్‌ 137. 11గా ఉంది. 

ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 1 సెంచరీ, 38 హాఫ్‌ సెంచరీలతో 5,068 పరుగులు చేశాడు. రోహిత్‌ ఆడిన మ్యాచ్‌లు 187 కాగా, యావరేజ్‌ 31.87గా ఉండగా, స్టైక్‌రేట్‌ 131.26గా ఉంది. ఇక్కడ వార్నర్‌ 4,821 పరుగులు చేయగా 4 సెంచరీలు, 44 హాఫ్‌ సెంచరీలు సాధించాడు. ఈ గణాంకాలే ఐపీఎల్‌ చరిత్రలో వార్నర్‌ను టాప్‌-5 బ్యాట్స్‌మన్‌లలో అగ్రస్థానంలో నిలిపాయి. ఇక శిఖర్‌ ధావన్‌ ఐదో స్థానంలో ఉన్నాడు. ధావన్‌ 161 మ్యాచ్‌ల్లో 4,648 పరుగులు చేశాడు. ఈ లీగ్‌లో ధావన్‌ 37 హాఫ్‌ సెంచరీలు సాధించగా సెంచరీలు లేవు. ధావన్‌ యావరేజ్‌ 33.20గా ఉండగా, స్టైక్‌రేట్‌ 124.64గా ఉంది.

మరిన్ని వార్తలు