IPL 2021- David Warner: నన్ను ఎక్కువగా హర్ట్‌ చేసింది అదే: వార్నర్‌ భావోద్వేగం

7 Jan, 2022 19:35 IST|Sakshi
PC: IPL

David Warner: ‘‘కెప్టెన్సీ నుంచి తొలగించడం... కనీసం తుది జట్టులో చోటు కల్పించకపోవడం... జట్టులోని యువ ఆటగాళ్లపై ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇలా చేయడం ద్వారా వారికి మీరు ఏం సందేశం ఇస్తున్నారు. నన్ను తీవ్రంగా బాధించిన విషయం ఏదైనా ఉందంటే... జట్టులోని యువ క్రికెటర్ల గురించే. ‘‘మాకు కూడా ఏదో ఒకరోజు ఇలా జరుగుతుంది’’ అనే అభద్రతా భావాన్ని పెంచుకునే అవకాశం ఉంది’’- ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌, ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ భావోద్వేగంతో పలికిన మాటలు ఇవి.

ఎస్‌ఆర్‌హెచ్‌కు తొలి ఐపీఎల్‌ కప్‌ సాధించి పెట్టిన వార్నర్‌కు గత సీజన్‌లో ఘోర అవమానం జరిగిన సంగతి తెలిసిందే. తొలుత సారథ్య బాధ్యతల నుంచి తొలగించిన యాజమాన్యం.. ఆ తర్వాత తుది జట్టులో కూడా చోటు ఇవ్వలేదు. రిటెన్షన్‌ సమయంలో కూడా అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో హైదరాబాద్‌ జట్టుతో వార్నర్‌ బంధానికి తెర పడినట్లయింది.

అయితే, ఈ విషయాన్ని ఆరెంజ్‌ ఆర్మీ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. వార్నర్‌ అన్న మళ్లీ ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆడితే చూడాలని ఉందంటూ సోషల్‌ మీడియా వేదికగా అతడికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయంపై పలుమార్లు స్పందించిన వార్నర్‌ భాయ్‌... తాజాగా జర్నలిస్టు బోరియా మజుందార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని ఆవేదన పంచుకున్నాడు. ‘‘జరిగిందేదో జరిగిపోయింది. పక్కన పెట్టినంత మాత్రాన ఎవరినీ విమర్శించే తత్వం  కాదు నాది. ఎవరినీ నిందించాల్సిన అవసరం లేదు.

బాధ పడుతూ కూర్చోకుండా.. వాస్తవాన్ని అర్థం చేసుకుని.. అసలు నన్ను ఎందుకు తప్పించారోనన్న విషయం గురించే ఆలోచిస్తాను’’ అంటూ స్ఫూర్తిదాయకంగా మాట్లాడాడు. కాగా మెగా వేలం-2022లో భాగంగా వార్నర్‌కు భారీ ధర లభించే అవకాశం ఉంది. రాయల్స్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు జట్టుకు అతడు కెప్టెన్‌ అవుతాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ఐపీఎల్‌-2021లో వైఫల్యం తర్వాత టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీతో ఫుల్‌ ఫామ్‌లోకి వచ్చిన వార్నర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌’ అవార్డు అందుకున్నాడు.

చదవండి: Ind Vs Sa 2nd Test: నువ్వు తోపు అనుకోకు.. అలా చేశావో నిన్ను మించినోడు లేడని చెప్పాను.. అంతే.. ఇక ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలే!

మరిన్ని వార్తలు