సన్‌రైజర్స్‌కు వార్నర్‌ షాక్‌ ఇవ్వనున్నాడా!

23 Feb, 2021 17:17 IST|Sakshi

సిడ్నీ: ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌కు భారీ దెబ్బ తగిలేలా ఉంది. ఆ జట్టు కెప్టెన్‌.. ప్రధాన బ్యాట్స్‌మన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఐపీఎల్‌ ఆడేది అనుమానంగా కనిపిస్తుంది. ఆసీస్‌, టీమిండియా సిరీస్‌ మధ్యలో వార్నర్‌ గాయపడిన సంగతి తెలిసిందే. భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గజ్జల్లో గాయం అవడంతో మూడో వన్డేతో పాటు టీ 20 సిరీస్‌కు దూరమయ్యాడు.

ఆ తర్వాత జరిగిన టెస్టు సిరీస్‌ మొదటి రెండు మ్యాచ్‌లకు దూరమైన వార్నర్‌ను మూడు, నాలుగు టెస్టులకు మాత్రం ఎంపికయ్యాడు. అతను పూర్తి ఫిట్‌గా లేకున్నా కూడా సీఏ అతన్ని బరిలోకి దింపిందంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి. అయితే తాను వంద శాతం ఫిట్‌గా ఉన్నానని.. అందుకే మిగిలిన టెస్టులకు ఎంపిక చేశారంటూ వార్నర్‌ అప్పట్లో చెప్పుకొచ్చాడు. అయితే చివరి రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడిన వార్నర్‌ 5,13, 1,48 పరుగులు చేశాడు. 

తాజాగా వార్నర్‌కు గజ్జల్లో గాయం మళ్లీ  తిరగబెట్టినట్లు తెలుస్తోంది. దాంతో పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించేందుకు కనీసం ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుందని వార్నరే స్వయంగా వెల్లడించాడు. దీంతో ఏప్రిల్ మొదటివారం నుంచి మొదలుకానున్న ఐపీఎల్ 2021 సీజన్‌లో డేవిడ్ వార్నర్‌ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ ఐపీఎల్‌లోపూ పూర్తి స్తాయిలో కోలుకుంటే కచ్చితంగా పాల్గొంటానని స్పష్టం చేశాడు. ఐపీఎల్‌లో పాల్గొనాలంటే సీఏ జారీ చేసిన ఎన్‌వోసీ తప్పనిసరిగా ఉండాలి. వార్నర్‌ ఫిట్‌గా లేకుంటే మాత్రం సీఏ ఎన్‌వోసీ ఇవ్వదు.. దీంతో ఎన్‌వోసీ లేకుండా అతను ఐపీఎల్‌లో ఆడలేడు. అలా చూసుకుంటే వార్నర్‌ ఐపీఎల్‌ 14వ సీజన్‌కు దూరమైతే మాత్రం ఎస్‌ఆర్‌హెచ్‌కు పెద్ద ఎదురుదెబ్బే అని చెప్పొచ్చు.

వార్నర్‌ దూరమైతే అతని స్థానంలో న్యూజిలాండ్ ఆటగాడు కేన్ విలియమ్సన్ వ్యహరించే అవకాశం ఉంది. 2018లో బాల్ టాంపరింగ్‌ కారణంగా డేవిడ్ వార్నర్‌పై ఏడాది నిషేధం పడగా.. అప్పుడు హైదరాబాద్‌ కెప్టెన్‌గా కేన్ విలియమ్సన్ బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ 142 మ్యాచ్‌లాడిన డేవిడ్ వార్నర్..  5,254 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2016లో వార్నర్‌  సారధ్యంలోనే సన్‌‌రైజర్స్ హైదరాబాద్‌ టైటిల్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: 'ఓడిపోయుండొచ్చు.. కోహ్లి మనసు గెలిచాం'
అశ్విన్‌‌ అవసరం తీరిపోయింది.. కమ్‌బ్యాక్‌ కష్టమే

మరిన్ని వార్తలు