David Warner:'ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రేమను పంచారు.. థాంక్యూ'

12 Jul, 2022 15:56 IST|Sakshi

శ్రీలంక ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. తినడానికి తిండి లేక అక్కడి ప్రజలు అల్లాడుతున్నారు. లంక అధ్యక్షుడిగా ఉన్న గోటబయ రాజపక్స దిగిపోవాలంటూ ఆ దేశ ప్రజలు ప్రెసిడెన్షియల్‌ భవనాన్ని ముట్టడించారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన రాజపక్స అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా రెండు రోజులపాటు లంకలోనే ఉన్న రాజపక్స దుబాయ్‌కు పారిపోయారంటూ వార్తలు వచ్చాయి. ఇక జూలై 13న(బుధవారం) రాజపక్స తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు సమాచారం.

ఇంత క్లిష్ట పరిస్థితుల్లోనూ లంకతో క్రికెట్‌ ఆడేందుకు వచ్చిన ఆస్ట్రేలియా క్రికెట్‌ విజయవంతంగా సిరీస్‌ను ముగించుకుంది. తమ దేశంలో పర్యటించినందుకు లంక అభిమానులు సైతం మ్యాచ్‌ వేదికగా లవ్‌ యూ ఆస్ట్రేలియా అంటూ ప్లకార్డులు పట్టుకొని ప్రదర్శన చేయడం హైలైట్‌గా నిలిచింది. ఈ సందర్భంగా ఆసీస్‌ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ తమ దేశానికి బయలుదేరేముందు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌ నోట్‌ రాసుకొచ్చాడు.  

‘ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ మాకు ఆతిథ్యమిచ్చినందుకు థాంక్యూ శ్రీలంక. ఈ పర్యటనకు వచ్చినందుకు మేము చాలా కృతజ్ఞులం. ఇక్కడున్నన్ని రోజులు మాపై మీరు చూపించిన ప్రేమ వెలకట్టలేనిది. మాకు ఎల్లవేళలా మద్దతునిచ్చారు. ఈ పర్యటనను మేము ఎప్పటికీ మరిచిపోలేం. మీ దేశంలో నాకు బాగా నచ్చిన విషయమేమిటంటే.. దేశంలో ఎంతటి దుర్భర పరిస్థితులు తలెత్తినా మీ ముఖం నుంచి చిరునవ్వు చెదరలేదు. మేం ఎక్కడికి వెళ్లినా మాకు ఘన స్వాగతం పలికారు. థాంక్యూ. నేను నా కుటుంబంతో కలిసి ఇక్కడకు హాలీడేకు రావడానికి ఎంతగానో ఎదురుచూస్తున్నాను’ అని రాసుకొచ్చాడు. కాగా వార్నర్‌ లంక జాతీయ జెండాను షేర్‌ చేయడం ఆసక్తి కలిగించింది.

ఇక ఐపీఎల్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లు నేరుగా లంక పర్యటనకు వెళ్లారు. లంకలో జూన్ 7 న మొదలైన ఆసీస్ పర్యటన సోమవారం గాలేలో ముగిసిన రెండో టెస్టుతో పూర్తైంది. ఈ టూర్ లో ఆసీస్.. టీ20 సిరీస్ ను గెలుచుకుని వన్డే సిరీస్‌ను కోల్పోయింది. రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను మాత్రం​ ఆస్ట్రేలియా సమం చేసుకుంది.

A post shared by David Warner (@davidwarner31)

చదవండి: ఆసీస్‌ అగ్రపీఠాన్ని కదిలించి మూడో స్థానానికి ఎగబాకిన శ్రీలంక

మరిన్ని వార్తలు