గెలిచినా.. ఓడినా.. డ్రా అయినా: వార్నర్‌

9 Dec, 2020 19:11 IST|Sakshi

నటరాజన్‌పై వార్నర్‌ ప్రశంసలు

సిడ్నీ: టీ20 సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న టీమిండియా బౌలర్‌ నటరాజన్‌పై ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ ప్రశంసలు కురిపించాడు. నెట్‌ బౌలర్‌గా వచ్చి సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలవడం గొప్ప విషయం అని పేర్కొన్నాడు. కాగా ఆసీస్‌తో జరిగిన చివరి వన్డేతో అరంగేట్రం చేసిన తమిళనాడు పేసర్‌ నటరాజన్‌.. టీ20 సిరీస్‌లో 6.91 ఎకానమీ రేటుతో 6 వికెట్లు తీసి తనదైన ముద్ర వేశాడు. జట్టుకు కీలకమైన మ్యాచుల్లో మెరుగ్గా రాణించడం ద్వారా ప్రత్యర్థి జట్టును దెబ్బకొట్టాడు. దీంతో తొలి మ్యాచ్‌ నుంచి సహచర ఆటగాళ్లు, క్రికెట్‌ దిగ్గజాలు నటరాజన్‌ ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురిపిస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఆ జాబితాలో ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సైతం చేరాడు. (చదవండి: చిన్నప్పటి నుంచి నేనింతే: నటరాజన్‌)

కాస్త బాధగా ఉన్నా
నటరాజన్‌తో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన అతడు... ‘‘గెలిచినా, ఓడినా, డ్రా అయినా.. మైదానం వెలుపల మేం పరస్పరం గౌరవించుకుంటాం. ఈ సిరీస్‌ చేజారినందుకు బాధగానే ఉన్నా.. నటరాజన్‌ అద్భుత ప్రదర్శనను మాత్రం మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నా. ఆటను తనెంతగానో ప్రేమిస్తాడు. నెట్‌ బౌలర్‌గా ఈ టూర్‌ ప్రారంభించి.. వన్డే, టీ20ల్లో ఇండియా తరఫున అరంగేట్రం చేశాడు. నువ్వు సాధించిన ఘనత అమోఘం’’ అని కితాబిచ్చాడు. అంతేగాక సన్‌రైజర్‌, ఆరెంజ్‌ఆర్మీ ట్యాగులను ఇందుకు జతచేశాడు.

దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. ‘‘నిన్ను ద్వేషించడానికి ఒక్క కారణం కావాలి వార్నర్‌ భాయ్‌’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో వార్నర్‌, నటరాజన్ సహ సభ్యులన్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్‌-2020 సీజన్‌లో మొత్తంగా 16వికెట్లు తీసి నటరాజన్‌ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. టీమిండియాతో చివరి వన్డేతో పాటు, టీ20 సిరీస్‌ నుంచి కూడా వార్నర్‌ తప్పుకొన్న విషయం విదితమే.


 

A post shared by David Warner (@davidwarner31)

మరిన్ని వార్తలు