David Warner Ashes Series: ఈసారి కచ్చితంగా ఔటయ్యేవాడు! బతుకుజీవుడా అనుకున్న వార్నర్‌

9 Dec, 2021 10:34 IST|Sakshi

Warner Lucky Missing Form Run Out Ashes Series.. యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌కు అదృష్టం బాగా కలిసొస్తుంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న వార్నర్‌ ప్రస్తుతం సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 54 ఓవర్లలో 3 వికెట్లు నష్టానికి 193 పరుగులు చేసింది. ఇక వార్నర్‌ మూడుసార్లు ఔట్‌ నుంచి ఎలా తప్పించుకున్నాడో చూద్దాం.

చదవండి: Ben Stokes No Balls: స్టోక్స్‌ నోబాల్స్‌ కథేంటి! అంపైర్లకు కళ్లు కనబడవా?

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో వార్నర్‌ 17 పరుగులు వద్ద ఉన్నప్పుడు  బెన్‌ స్టోక్స్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు.. అది నోబాల్‌ కావడంతో తొలిసారి తప్పించుకున్నాడు. వార్నర్‌ 49 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇన్నింగ్స్‌ 32వ ఓవర్లో  ఇచ్చిన సింపుల్‌ క్యాచ్‌ను స్లిప్‌లో రోరీ బర్న్స్‌ నేలపాలు చేయడంతో రెండోసారి బతికిపోయాడు. 60 పరుగుల వద్ద వార్నర్‌ ముచ్చటగా మూడోసారి బతికిపోయాడు. మార్క్‌వుడ్‌ బౌలింగ్‌లో షాట్‌ ఆడిన వార్నర్‌ సింగిల్‌కు ప్రయత్నించగా.. షార్ట్‌లెగ్‌ దిశలో ఉన్న హమీద్‌ బంతిని అందుకున్నాడు.

దీంతో అలెర్ట్‌ అయిన వార్నర్‌ వెనక్కి తిరిగే క్రమంలో జారి పడ్డాడు. బ్యాట్‌ను క్రీజులో పెట్టడంలో వార్నర్‌ విఫలం కావడం.. హమీద్‌ బంతిని వేగంగా స్టంప్స్‌ వైపు విసరడంతో కచ్చితంగా ఔట్‌ అనే అనుకున్నాం. కానీ బంతి స్టంప్స్‌కు తగలకుండా పక్కకు వెళ్లడం.. వార్నర్‌ కూడా పాక్కుంటూ తన చేతులను క్రీజులో ఉంచడం జరిగిపోయింది. ఈ వీడియో చూసిన అభిమానులు వార్నర్‌కు అదృష్టం బాగా కలిసొచ్చింది.. అంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: Ashes Series: స్టోక్స్‌ సూపర్‌ ఎంట్రీ అనుకున్నాం.. ఊహించని ట్విస్ట్‌

మరిన్ని వార్తలు