David Warner Leadership Ban: 'మానసిక వేదనకు గురయ్యా'.. సొంత బోర్డుపై ఆగ్రహం

24 Dec, 2022 19:00 IST|Sakshi

ఆస్ట్రేలియా సీనియర్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ శనివారం సొంత బోర్డు.. క్రికెట్‌ ఆస్ట్రేలియాపై విమర్శనాస్త్రాలు సంధించాడు. కెప్టెన్‌ అయ్యే అవకాశం లేకుండా లైఫ్‌టైమ్‌ బ్యాన్‌ విధించడంపై అప్పీల్‌కు వెళ్తే కనీస మద్దతు లభించకపోవడం దారుణమని పేర్కొన్నాడు. ఇటీవలే వెస్టిండీస్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌లో ఈ అంశం నన్ను మానసిక వేదనకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

2018లో కేప్‌టౌన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బాల్‌ టాంపరింగ్‌(SandpaperGate) వివాదం రేపిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో అప్పటి కెప్టెన్‌ ‍స్టీవ్‌ స్మిత్‌, వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌, కామెరున్‌ బెన్‌క్రాప్ట్‌లు కలిసి బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో వారిపై నిషేధం పడింది. ఈ నేపథ్యంలో డేవిడ్‌ వార్నర్‌పై ఏడాది నిషేధంతో పాటు కెప్టెన్‌ కాకుండా లైఫ్‌టైమ్‌ బ్యాన్‌ విధించింది. 

ఇటీవలే వెస్టిండీస్‌ పర్యటన సందర్భంగా.. రెండో టెస్టుకు ముందు వార్నర్‌ తన కెప్టెన్సీపై లైఫ్‌టైమ్‌ బ్యాన్‌ ఎత్తేయాలంటూ క్రికెట్‌ ఆస్ట్రేలియాకు అప్పీల్‌ చేశాడు. దానిపై అతను బోర్డుతో తీవ్రంగా పోరాడినప్పటికి మద్దతు కరువయిపోయింది. అయితే తన వాదనలను బోర్డు ఎదుట చెప్పేందుకు సిద్ధమని.. కానీ బోర్డు మాత్రం బహిరంగంగా చర్చించాలని పట్టుబట్టింది. ఇదంతా నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టే అంశంలా కనిపించింది. అందుకే కెప్టెన్సీ బ్యాన్‌ను ఎత్తేయాలనే అభ్యర్థనను వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపాడు.

ఈ నిర్ణయం వార్నర్‌ను మానసిక వేదనకు గురి చేసింది. ఆ ప్రభావం ఆటపై కూడా పడింది. పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో 5, 48 పరుగులు మాత్రమే చేయగలిగాడు. తాజాగా వార్నర్‌ క్రికెట్‌ ఆస్ట్రేలియాపై పరోక్షంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.'' కొంతమంది పనిగట్టుకొని నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఎంతలా అంటే అది నా ఆటపై తీవ్ర ప్రభావం చూపించింది. కెప్టెన్సీపై లైఫ్‌టైమ్‌ బ్యాన్‌ ఎత్తేయాలని అప్పీల్‌ చేస్తే బోర్డు నుంచి మద్దతు కరువయింది. ఇది నన్ను మానసిక వేదనకు గురి చేసింది.

నావైపు నుంచి సమస్యను విన్నవించుకున్నప్పటికి..  క్రికెట్‌ ఆస్ట్రేలియా పాయింట్‌ ఆఫ్‌ వ్యూ నుంచి నాకు ఎలాంటి మద్దతు రాలేదు. నా జట్టు సహచరులు, సిబ్బంది నుంచి మంచి సపోర్ట్‌ ఉన్నప్పటికి క్రికెట్‌ ఆస్ట్రేలియాకు నేను కెప్టెన్‌ అవ్వడం ఇష్టం లేదని స్పష్టంగా అర్థమైంది. ఇది నాకు నిజంగా కష్టకాలంలా ఉంది. దీని నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నా.'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక సౌతాఫ్రికాతో బాక్సింగ్‌ డే టెస్టు ద్వారా డేవిడ్‌ వార్నర్‌ టెస్టుల్లో మరో మైలురాయిని అందుకోనున్నాడు. మెల్‌బోర్న్‌ వేదికగా జరగనున్న ఈ టెస్టు మ్యాచ్‌ వార్నర్‌కు వందో మ్యాచ్‌ కానుంది. అయితే జనవరి 2020 నుంచి వార్నర్‌ బ్యాట్‌ నుంచి ఒక్క టెస్టు సెంచరీ కూడా రాలేదు. ప్రస్తుతం జట్టులో సీనియర్‌ క్రికెటర్‌గా ఉన్న వార్నర్‌.. ఆస్ట్రేలియా తరపున ఇప్పటివరకు 99 టెస్టులు, 141 వన్డేలు, 99 టి20 మ్యాచ్‌లు ఆడాడు.

చదవండి: Virat Kohli: శ్రుతి మించిన బంగ్లా ఆటగాళ్ల చర్య.. కోహ్లి ఆగ్రహం

షాహిద్‌ అఫ్రిదికి పీసీబీలో కీలక బాధ్యతలు

మరిన్ని వార్తలు