'ఆర్చర్‌ రెడీగా ఉండు .. తేల్చుకుందాం'

20 Sep, 2020 10:59 IST|Sakshi

దుబాయ్‌ : డేవిడ్‌ వార్నర్‌.. విధ్వంసానికి పెట్టింది పేరు. అతను ఫామ్‌లో ఉన్నాడంటే ప్రత్యర్థి బౌలర్లకు ఇక చుక్కలే. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో విదేశీ ఆటగాళ్లలో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా వార్నర్‌ రికార్డు నెలకొల్పాడు. 2018లో ఏడాది నిషేదంతో క్రికెట్‌ దూరంగా ఉన్న వార్నర్‌ 2019లో కేన్‌ విలియమ్‌సన్‌ కెప్టెన్సీలో అద్భుత ప్రదర్శనతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌ 2020 సీజన్‌కు గానూ మళ్లీ కెప్టెన్‌గా ఎంపికైన వార్నర్‌ 2016ను పునరావృతం చేస్తాడేమో చూడాలి. ఇప్పటికే ఐపీఎల్‌ 13వ సీజన్‌ ఆడేందుకు దుబాయ్‌కు చేరుకున్న వార్నర్‌ సన్‌రైజర్స్‌ జట్టుతో కలిశాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌ ముగిసిన తర్వాత నేరుగా దుబాయ్‌లో అడుగుపెట్టిన వార్నర్‌ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. (చదవండి : 'ధోని.. నిజంగా నువ్వు అద్భుతం')

'రెండేళ్ల తర్వాత  సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా పనిచేయబోతున్నా. గత ఐదేళ్లుగా జట్టుతో పాటే కొనసాగుతున్నా కాబట్టి జట్టులోని ఆటగాళ్ల గురించి మాట్లాడేందుకు ఏం లేదు. కెప్టెన్‌గా నా విధులను సక్రమంగా నిర్వహిస్తూనే బ్యాట్స్‌మన్‌గా అన్నిఅస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నా. ఇంగ్లండ్‌తో సిరీస్‌ ముగిసిన తర్వాత నేరుగా ఇక్కడికే చేరుకోవడం.. మంచి ప్రాక్టీస్‌ కూడా లభించడం జరిగింది. ఇక మొదటి మ్యాచ్‌కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20, వన్డే సిరీస్‌లో జోఫ్రా ఆర్చర్‌ నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. అతని బౌలింగ్‌లో ఐదు సార్లు ఔటయ్యాను. ఆర్చర్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. ఈ సందర్భంగా ఆర్చర్‌ రెడీగా ఉండు తేల్చుకుందాం' అంటూ  వార్నింగ్‌ ఇచ్చాడు.

కాగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తమ మొదటి మ్యాచ్‌ ఆర్‌సీబీతో సెప్టెంబర్‌ 21న తలపడనుంది. డేవిడ్‌ వార్నర్‌, కేన్‌ విలియమ్‌సన్‌, బెయిర్‌ స్టో, బిల్లీ స్టాన్‌లేక్‌, రషీద్‌ ఖాన్‌ వంటి విదేశీ ఆటగాళ్లు బలంగా కనిపిస్తున్న సన్‌రైజర్స్‌ స్వదేశీ ఆటగాళ్లో ఒక్క భూవీ తప్ప పెద్ద పేరున్న ఆటగాళ్లు లేకపోవడం పెద్ద లోటుగా చెప్పొచ్చు. 

2014లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన వార్నర్‌కు ఆ జట్టు తరపున అద్భుతమైన రికార్డు ఉంది. అంతేగాక 2015లో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన వార్నర్‌.. మరుసటి ఏడాది 2016లో జట్టుకు టైటిల్‌ అందించాడు. ఇక బ్యాట్స్‌మెన్‌గా లెక్కలేనన్ని రికార్డులు సాధించాడు. 2014లో సన్‌రైజర్స్‌ తరపున మొదటిసారి ఆడిన వార్నర్‌.. 528 పరుగులతో టాప్‌ 4లో స్థానం సంపాదించాడు. తర్వాత వరుసగా 2015లో 562 పరుగులు, 2016లో 848 పరుగులు, 2017లో 641 పరుగులు, 2019లో 692 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఐపీఎల్‌ సీజన్లలో అత్యధిక పరుగులు మూడు సార్లు సాధించి ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్న ఏకైక విదేశీ ఆటగాడిగా వార్నర్‌ రికార్డు నెలకొల్పాడు.

మరిన్ని వార్తలు