IPL 2023: ఈసారి టైటిల్‌ గెలిచే అవకాశాలు వాళ్లకే: ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌ రిక్కీ పాంటింగ్‌

31 Mar, 2023 11:00 IST|Sakshi
రిక్కీ పాంటిం‍గ్‌- రిషభ్‌ పంత్‌ (PC: DC)

IPL 2023: ఆస్ట్రేలియా దిగ్గజం, ఢిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌ రిక్కీ పాంటింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్‌-2023లో గతేడాది చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌, రన్నరప్‌ రాజస్తాన్‌ రాయల్స్‌ ఆధిపత్యం కొనసాగించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు. టీ20 ఫార్మాట్లో విజేతలను అంచనా వేయడం కష్టమేనన్న పాంటింగ్‌.. మిగతా జట్లతో పోలిస్తే రాజస్తాన్‌ రాయల్స్‌ మాత్రం మెరుగ్గా కనిపిస్తోందని పేర్కొన్నాడు.   

రిక్కీ పాంటింగ్‌ మార్గదర్శనంలో టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐదో స్థానంతో ఐపీఎల్‌-2022ను ముగించిన విషయం తెలిసిందే. అయితే, ఈసారి యాక్సిడెంట్‌ కారణంగా పంత్‌ పదహారో ఎడిషన్‌కు దూరం కాగా.. ఆసీస్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ ఢిల్లీ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.

ఈక్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ పంత్‌లేని లోటును అధిగమించి మెరుగైన ప్రదర్శన కనబరిచాలని పట్టుదలగా ఉంది. ఇందుకు సంబంధించి హెడ్‌కోచ్‌ పాంటింగ్‌ ఇప్పటికే ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు వెల్లడించాడు.

రాజస్తాన్‌ ఫేవరెట్‌.. ఎందుకంటే
ఈ నేపథ్యంలో ఐసీసీ రివ్యూ షోలో పాంటింగ్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘‘ఇది నిజంగా చాలా కఠినమైన ప్రశ్న.. ఐపీఎల్‌లో ఏ జట్టు డామినేట్‌ చేస్తుందన్న విషయాన్ని కచ్చితంగా అంచనా వేయలేం. గతేడాది అద్భుతంగా రాణించిన గుజరాత్‌.. ఏకంగా టైటిల్‌ విజేతగా నిలిచింది.

ఇక రాజస్తాన్‌ రాయల్స్‌ను తక్కువ చేయలేం. ఆ జట్టు పటిష్టంగా ఉంది. ఈసారి కూడా వారి ఎంపిక చాలా బాగుంది. టీ20లలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అయితే, జట్ల బలాబలాలను విశ్లేషిస్తే నాకైతే రాజస్తాన్‌ రాయల్స్‌ మిగతా జట్ల కంటే మెరుగ్గా ఉన్నట్లు కనిపిస్తోంది.

రాజస్తాన్‌ ఈసారి ఫేవరెట్‌గా బరిలో దిగనుంది’’ అని పాంటింగ్‌ పేర్కొన్నాడు. వారికి ట్రోఫీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. కాగా అరంగేట్ర సీజన్‌లోనే హార్దిక్‌ సేన ట్రోఫీ గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

మరోవైపు, రెండోసారి ఫైనల్‌ చేరిన సంజూ శాంసన్‌ బృందం రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక యువ ఆటగాళ్ల విషయానికొస్తే.. తమ ప్లేయర్లు యశ్‌ ధుల్‌, అమన్‌ ఖాన్‌ ఈసారి అద్భుతంగా రాణిస్తారని రిక్కీ పాంటింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

చదవండి: IPL 2023: తెర వెనుక నాయకులను చూసేద్దామా.. 
 Neymar: ఆన్‌లైన్‌ పేకాటలో 9 కోట్లు మాయం.. నెయ్‌మర్‌ కన్నీటిపర్యంతం!

మరిన్ని వార్తలు