David Warner: ‘ప్రతీకారం తీర్చుకున్న వార్నర్‌’.. ఆ ఒక్క మాట చాలు.. దెబ్బ అదుర్స్‌ కదూ!

6 May, 2022 11:14 IST|Sakshi
డేవిడ్‌ వార్నర్‌, ఢిల్లీ అసిస్టెంట్‌ కోచ్‌ షేన్‌ వాట్సన్‌, రోవ్‌మన్‌ పావెల్‌(PC: IPL Twitter)

IPL 2022 DC Vs SRH- David Warner Comments: ‘‘నాకు వేరే మోటివేషన్‌(ప్రేరణ) ఏమీ అక్కర్లేదు. ఇంతకు ముందు ఏం జరిగిందో మనమంతా చూశాం కదా! నిజంగా ఈ గెలుపు ఎంతో సంతోషాన్నిచ్చింది’’- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయానంతరం ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ చేసిన వ్యాఖ్యలు ఇవి. అవును మరి.. ఈ మ్యాచ్‌లో గెలిచి ఢిల్లీకి రెండు పాయింట్లు సాధించడం ఎంత ముఖ్యమో.. వార్నర్‌కు రైజర్స్‌పై పైచేయి సాధించడం కూడా అంతే ముఖ్యం. 

అవమానాలు భరించి..
ఎవరు అవునన్నా కాదన్నా.. కారణాలేమైనా గత సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యాజమాన్యం వార్నర్‌ పట్ల అత్యంత అవమానకర రీతిలో ప్రవర్తించిందనేది క్రికెట్‌ ప్రపంచం ఎరిగిన సత్యం. ఈ విషయంపై ఆరెంజ్‌ ఆర్మీ ఫ్యాన్స్‌ సైతం మండిపడ్డారంటే ఆ తీవ్రత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

తొలుత వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించడం, ఆ తర్వాత తుది జట్టు నుంచి తప్పించడం... అనంతరం డ్రింక్స్‌ మోసేలా పరిస్థితులు కల్పించడం.. అయినా కూడా వార్నర్‌ మనసులోని బాధను పెద్దగా బయటపెట్టలేదు. 

గెలిచి నిలిచాడు..
సన్‌రైజర్స్‌కు తొలి టైటిల్‌ సాధించిపెట్టిన ఈ ‘మాజీ కెప్టెన్‌’ చిరునవ్వుతోనే వాటర్‌ బాటిల్స్‌ మోస్తూ ‘ఫామ్‌లేమి’ కారణంగా ఎదురైన అవమానాలను భరించాడు. అయితే, ఆ తర్వాత టీ20 వరల్డ్‌ కప్‌-2021లో అద్భుత ప్రదర్శనతో ఆస్ట్రేలియాను విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నీగా నిలిచాడు వార్నర్‌.

ఎక్కడై(యూఏఈ)తే తాను క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నాడో అక్కడే గెలిచి నిలిచాడు. ఐసీసీ టోర్నీతో అద్భుత ఫామ్‌లోకి వచ్చినప్పటికీ సన్‌రైజర్స్‌ వార్నర్‌ను రిటైన్‌ చేసుకోకపోవడం గమనార్హం.

రావడం కాస్త లేటైనా.. అద్భుత ఇన్నింగ్స్‌తో
ఈ క్రమంలో ఐపీఎల్‌-2022 మెగా వేలంలోకి వచ్చిన వార్నర్‌ భాయ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ 6.25 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసింది. ఇక పాకిస్తాన్‌తో సిరీస్‌ నేపథ్యంలో ఆరంభ మ్యాచ్‌లకు దూరమైనా ఢిల్లీ జట్టుతో చేరగానే వార్నర్‌ బ్యాట్‌ ఝులిపించడం మొదలుపెట్టాడు. జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ తన విలువేమిటో చాటుకున్నాడు.

ఇక గురువారం(మే 5)న సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌ వార్నర్‌కు ప్రత్యేకం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. హైదరాబాద్‌ జట్టును వీడిన తర్వాత ఆ టీమ్‌తో తలపడిన తొలి మ్యాచ్‌లోనే వార్నర్‌ అదరగొట్టాడు. 58 బంతుల్లో ఏకంగా 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 92 పరుగులతో అజేయంగా నిలిచాడు.

రోవ్‌మన్‌ పావెల్‌(67 నాటౌట్‌)తో కలిసి ఢిల్లీ భారీ స్కోరు చేయడంలో సాయమందించి.. ఆపై గెలుపొందడంలో ముఖ్య భూమిక పోషించాడు. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఢిల్లీ.. హైదరాబాద్‌ను వెనక్కి నెట్టి ఐదో స్థానానికి చేరుకోవడం విశేషం.

దెబ్బ అదుర్స్‌ కదూ!
తద్వారా ప్లే ఆఫ్‌ రేసులో సన్‌రైజర్స్‌ కంటే ఓ అడుగు ముందుకేయడం మరో విశేషం. ఇక ఈ ఎడిషన్‌లో వార్నర్‌ ఇప్పటి వరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లలో 356 పరుగులు సాధించాడు. ఇందులో 4 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక ఈ సీజన్‌లో ఇప్పటి వరకు వార్నర్‌ అత్యధిక స్కోరు 92 నాటౌట్‌. అది కూడా సన్‌రైజర్స్‌పై కావడంతో ఈ మ్యాచ్‌ అతడికి వెరీ వెరీ స్పెషల్‌.

ఈ క్రమంలో వార్నర్‌ ఫ్యాన్స్‌ అతడిని ఆకాశానికెత్తుతున్నారు. ‘‘ఆటలో గెలుపోటములు సహజం. కానీ అవమానాలకు అదే ఆటతో నువ్వు బదులు తీర్చుకున్న తీరు అమోఘం. ఎంతైనా వార్నర్‌ అన్న .. వేరే లెవల్‌.. దెబ్బ అదుర్స్‌ కదూ’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఐపీఎల్‌ మ్యాచ్‌ 50: ఎస్‌ఆర్‌హెచ్‌ వర్సెస్‌ ఢిల్లీ స్కోర్లు
ఢిల్లీ- 207/3 (20)
ఎస్‌ఆర్‌హెచ్‌- 186/8 (20)

చదవండి👉🏾 IPL 2022: రైజర్స్‌కు చుక్కలు చూపించిన వార్నర్‌.. కేన్‌ మామ ఓ సెల్ఫీ దిగుదామా!

Poll
Loading...
మరిన్ని వార్తలు