అప్పుడు సచిన్‌.. ఇప్పుడు డీకాక్‌

18 Oct, 2020 21:22 IST|Sakshi
డీకాక్‌(ఫైల్‌ఫోటో)

దుబాయ్‌: కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 177 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌ ఆదిలోనే రోహిత్‌ శర్మ(9), సూర్యకుమార్‌ యాదవ్‌(0) వికెట్లను కోల్పోయింది. అర్షదీప్‌ వేసిన మూడో ఓవర్‌ ఐదో బంతికి రోహిత్‌ ఔట్‌ కాగా, షమీ వేసిన నాల్గో ఓవర్‌ మూడో బంతికి సూర్యకుమార్‌ డకౌట్‌ అయ్యాడు. ఇక ఇషాన్‌ కిషన్‌(7) కూడా నిరాశపరిచాడు. డీకాక్‌(53; 43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు)లకు జతగా కృనాల్‌ పాండ్యా(34; 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకున్నాడు. హార్దిక్‌ పాండ్యా(8) విఫలం కాగా, చివర్లో పొలార్డ్‌(34 నాటౌట్‌; 12 బంతుల్లో 1 ఫోర్‌,  4 సిక్స్‌లు), కౌల్టర్‌ నైల్‌(24 నాటౌట్‌; 12 బంతుల్లో  4 ఫోర్లు)లు బ్యాట్‌ ఝుళిపించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లకు 176 పరుగులు చేసింది. కింగ్స్‌ పంజాబ్‌ బౌలర్లలో మహ్మద్‌ షమీ, అర్షదీప్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, క్రిస్‌ జోర్డాన్‌, రవి బిష్నోయ్‌లు చెరో వికెట్‌ తీశారు.

సచిన్‌ తర్వాత డీకాక్‌
ఈ సీజన్‌లో డీకాక్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. చివరి ఐదు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు హాఫ్‌ సెంచరీలు సాధించాడు. ఇందులో మూడు వరుస హాఫ్‌ సెంచరీలు ఉండటం విశేషం. కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు కేకేఆర్‌పై 78 పరుగులు సాధించిన డీకాక్‌.. అంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 53 పరుగులు చేశాడు. ఫలితంగా ముంబై ఇండియన్స్‌ తరఫున వరుసగా మూడు హాఫ్‌ సెంచరీలు సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. 2010లో ఈ ఫీట్‌ను సచిన్‌ టెండూల్కర్‌ నమోదు చేయగా, ఆ తర్వాత మరో పదేళ్లకు ముంబై తరఫున ఆ ఘనతను డీకాక్‌ నమోదు చేశాడు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో డీకాక్‌ 67 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు