డీకాక్‌ డగౌట్‌ వైపు పరుగు.. రోహిత్‌ నవ్వులు!

17 Oct, 2020 15:43 IST|Sakshi

అబుదాబి:  కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌  8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కేకేఆర్‌ నిర్దేశించిన 149 పరుగుల టార్గెట్‌ను ముంబై 16.5 ఓవర్లలోనే కొట్టేసింది.  డీకాక్‌(78 నాటౌట్‌; 44 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించడంతో ముంబై సునాయాసంగా గెలుపొందింది. వన్‌సైడ్‌ వార్‌ అన్నట్లు ముంబై రెచ్చిపోయి ఆడింది. ఇది ముంబైకు ఆరో విజయం. ఫలితంగా పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌కు వచ్చేసింది. ఇక కేకేఆర్‌కు నాల్గో ఓటమి. ఈ సీజన్‌లో కేకేఆర్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబైనే విజయం సాధించింది. మరొకవైపు ఇరుజట్లు తలపడిన చివరి 12 మ్యాచ్‌ల్లో 11 సార్లు ముంబైనే విజయం వరించడం విశేషం.

ఈ మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. క్వింటాన్‌ డీకాక్‌ ట్రెయినింగ్‌ ప్యాంట్‌తోనే సహచర ఓపెనర్‌ రోహిత్‌ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించడానికి సిద్ధమయ్యాడు. దాన్ని సహచర ముంబై ఆటగాళ్లు గుర్తించి వెనకాల వచ్చి చెప్పడంతో డీకాక్‌ మళ్లీ డగౌట్‌ వైపు పరుగు తీశాడు. అప్పటికి డీకాక్‌ బ్యాట్‌ పట్టుకుని సగానికి పైగా దూరం వచ్చేశాడు. అసలు విషయం తెలుసుకుని అయోమయానికి గురైన డీకాక్‌ ప్యాంట్‌ మార్చుకోవడానికి మళ్లీ వెనక్కి వెళ్లబోతుండగా రోహిత్‌ ఆపేశాడు. ప్యాంట్‌పై వెనకాల ఉన్న ఆరెంజ్‌ కలర్‌ను కవర్‌ చేస్తే సరిపోతుందని చెబితే డీకాక్‌ ఆగిపోయాడు.(‘వైడ్‌ బాల్‌’ వివాదంపై భజ్జీ ఘాటు రియాక్షన్‌)

దాంతో జెర్సీని కిందకి లాగేసుకుని ఆ ఆరెంజ్‌ కలర్‌ కనబడకుండా చేశాడు. అయితే ఇది రోహిత్‌కు విపరీతమైన నవ్వు తెప్పించింది.  క్రీజ్‌లోకి వచ్చేవరకూ రోహిత్‌ అలా నవ్వుతూనే ఉన్నాడు. ఈ విషయాన్ని అంపైర్‌ సైతం అడగడంతో రోహిత్‌ ముసిముసి నవ్వులు నవ్వుతూ చెప్పాడు. దానికి అంపైర్‌ కూడా నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. నిన్న మ్యాచ్‌ చూసే క్రమంలో చాలామంది అభిమానులకు రోహిత్‌ నవ్వు ఒక్కటే అర్థమైంది. రోహిత్‌ ఎందుకు అంతలా నవ్వుతున్నాడు అని తలలు పట్టుకున్నారు.  కొంతమంది నెటిజన్లు సోషల్‌ మీడియాలో ఈ వీడియోను పోస్ట్‌ చేయడంతో అసలు విషయం తెలిసింది. 

ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 149 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌(39 నాటౌట్‌; 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ప్యాట్‌ కమిన్స్‌(53 నాటౌట్‌; 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)లు ఆకట్టుకోవడంతో కేకేఆర్‌ ఈ మాత్రం స్కోరును బోర్డుపై ఉంచకల్గింది.  ప్రధానంగా కమిన్స్‌ మెరుపులతో కేకేఆర్‌ గౌరవప్రదమైన స్కోరును చేయకల్గింది. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు