ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ డీన్‌జోన్స్‌ ఇకలేరు..

24 Sep, 2020 16:10 IST|Sakshi

ముంబై:  ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌, ప్రముఖ వ్యాఖ్యాత డీన్‌ జోన్స్‌(59)ఇకలేరు. ఈరోజు గుండె పోటుకు గురైన డీన్‌జోన్స్‌ కన్నుమూశారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌ల్లో భాగంగా బ్రాడ్‌కాస్టింగ్‌ వ్యవహారాల్లో నిమగ్నమైన జోన్స్‌ ముంబైలో ఉన్నారు. గురువారం మధ్యాహ్నం తీవ్ర గుండెపోటుకు గురైన జోన్స్‌ తుదిశ్వాస విడిచారు. ఆసీస్‌ తరఫున 52 టెస్టులు, 164 వన్డేలను జోన్స్‌ ఆడారు. తన క్రికెట్‌ కెరీర్‌ ముగిసిన తర్వాత కామెంటేటర్‌గా అవతారమెత్తారు.

1984-1992 మధ్య కాలంలో ఆసీస్‌ తరఫున క్రికెట్‌ ఆడారు జోన్స్‌.  టెస్టు క్రికెట్‌లో 3,631 పరుగుల్ని జోన్స్‌ సాధించగా, అందులో 11 సెంచరీలు, 14 హాఫ్‌ సెంచరీలు ఉ‍న్నాయి. టెస్టు కెరీర్‌లో రెండు డబుల్‌ సెంచరీలు జోన్స్‌ సాధించాడు. ఇక వన్డే కెరీర్‌లో 7 సెంచరీలు, 46 హాఫ్‌ సెంచరీల సాయంతో 6,068 పరుగులు సాధించారు. వన్డేల్లో జోన్స్‌  సగటు 44. 61గా ఉంది. 1986లో భారత్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో జోన్స్‌ డబుల్‌ సెంచరీ సాధించారు. ఆ టెస్టు టైగా ముగిసింది. జోన్స్‌ వీరోచిత బ్యాటింగ్‌తో ఆసీస్‌ ఓడిపోయే టెస్టు మ్యాచ్‌ను టైగా ముగించింది. జోన్స్‌ తన ఫస్టక్లాస్‌ కెరీర్‌లో 51.85 సగటుతో 19,188 పరుగులు సాధించారు. ఆయన ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు 324 నాటౌట్‌.

చాంపియన్‌ కామెంటేటర్‌
జోన్స్‌  మృతిని ఐపీఎల్‌ బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ ధృవీకరించింది. ‘ జోన్స్‌  ఇకలేరు. ఇది చాలా విషాదకరమైన ఘటన. ఈ వార్తను షేర్‌ చేయడం కలిచి వేస్తోంది. ఆకస్మికంగా గుండెపోటు రావడంతో జోన్స్‌ ప్రాణాలు విడిచారు. ఆయన మృతికి నివాళులర్పిస్తున్నాం. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి అండగా ఉంటాం. ఆయన మృతదేహాన్ని ఆస్ట్రేలియాకు చేర్చడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మేము ఆస్ట్రేలియా హై కమిషన్‌తో టచ్‌లో ఉన్నాం. జోన్స్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. దక్షిణాసియాలో క్రికెట్‌ అభివృద్ధి చెందడానికి జోన్స్‌ ఎంతో కృషి చేశారు. ఈ గేమ్‌కు ఆయనొక గొప్ప అంబాసిడర్‌. ఆయనకు క్రికెట్‌ అంటే ప్రాణం. ఎప్పుడూ యువ క్రికెటర్లను ప్రోత్సహించడంలో ముందుండే వారు. కామెంటరీలో ఆయనది ఒక ప్రత్యేకమైన శైలి. ఒక చాంపియన్‌ కామెంటేటర్‌. జోన్స్‌ కామెంటరీకి లక్షలాది అభిమానులున్నారు. ఆయన్ని మాతో పాటు ఫ్యాన్స్‌ కూడా మిస్సవుతున్నందుకు చింతిస్తున్నాం’ అని స్టార్‌ స్పోర్ట్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 

>
మరిన్ని వార్తలు