Deandra Dottin Retirement: అంతర్గత విభేదాలు.. వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్‌ సంచలన నిర్ణయం!

1 Aug, 2022 15:32 IST|Sakshi

వెస్టిండీస్ మహిళల క్రికెట్ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ డియాండ్రా డాటిన్ సంచలన నిర్ణయం తీసుకుంది. డాటిన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. డాటిన్ తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా సోమవారం ప్రకటించింది. కాగా జట్టులో అంతర్గత విభేదాలు వల్ల డాటిన్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకున్న ఆమె  దేశవాళీ క్రికెట్‌లో మాత్రం కొనసాగనున్నట్లు తెలిపింది. "14 ఏళ్ల నా అంతర్జాతీయ కెరీర్‌లో నాకు మద్దతుగా నిలిచిన వెస్టిండీస్‌ క్రికెట్‌కు, అభిమానులకు ధన్యవాదాలు.

నేను చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇకపై ప్రపంచ వ్యాప్తంగా దేశవాళీ క్రికెట్ ఆడేందుకు నేను ఎదురుచూస్తున్నాను” అని ట్విటర్‌లో డాటిన్‌ పేర్కొంది. కాగా డాటిన్‌ ప్రస్తుతం కామన్‌ వెల్త్‌గేమ్స్‌లో బార్బడోస్ జట్టు తరపున ఆడుతోంది. కామన్‌ వెల్త్‌గేమ్స్‌లో భాగంగా ఆగస్టు 3న భారత్‌ మహిళల జట్టుతో బార్బడోస్ తలపడనుంది.

అయితే డాటిన్ ఈ మ్యాచ్‌కు ముందు రిటైర్మెంట్ ప్రకటించడం బార్బడోస్‌కు గట్టి ఎదురుదెబ్బ అనే చెప్పుకోవాలి. ఇక 2008లో డాటిన్‌  విండీస్‌ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. ఇప్పటి వరకు తన అంతర్జాతీయ కెరీర్‌లో 146 వన్డేలు, 126 టీ20ల్లో విండీస్‌కు ప్రాతినిధ్యం వహించింది. అదే విధంగా తొలి టీ20 ప్రపంచకప్‌ గెలిచిన విండీస్‌ జట్టులో డాటిన్‌ భాగంగా ఉంది.
చదవండిEng VS SA: స్టబ్స్‌ అద్భుత విన్యాసం.. ఒంటిచేత్తో అవలీలగా! ఇలాంటి క్యాచ్‌ ఎప్పుడూ చూసి ఉండరు!

మరిన్ని వార్తలు