IPL 2022: అదృష్టం అంటే దీపక్‌ చాహర్‌దే.. ఒక్క మ్యాచ్‌ ఆడకపోయినా 14 కోట్లు రికవరీ..!

17 Apr, 2022 16:09 IST|Sakshi

Deepak Chahar: ఐపీఎల్‌ 2022 మెగా వేలంలో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ దీపక్‌ చాహర్‌ను చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ. 14 కోట్ల భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే గాయం కారణంగా అతను ఐపీఎల్‌ సీజన్‌ మొత్తానికే దూరమై సీఎస్‌కేకు తీరని శోకాన్ని మిగిల్చాడు. చాహర్‌పై గంపెడాశలు పెట్టుకున్న చెన్నై టీమ్‌.. అతను సీజన్‌ మొత్తానికే దూరం అయ్యాడని తెలిసి నైరాశ్యంలో మునిగిపోయింది. వరుస ఓటములతో (5 మ్యాచ్‌ల్లో 4 ఓటములు) సతమతమవుతున్న సీఎస్‌కేకు దీపక్‌ చాహర్‌ లేని లోటు పూడ్చలేనిది.

కాగా, ప్రస్తుత సీజన్‌కు సంబంధించి దీపక్‌ చాహర్‌ అంత అదృష్టవంతుడు మరొకరు లేరనడం అతిశయోక్తి కాదు. ఈ సీజన్‌లో అతను ఒక్క మ్యాచ్‌ ఆడకపోయినా  మెగా వేలంలో దక్కించుకున్న 14 కోట్లు సొంతం చేసుకోనున్నాడు. అది ఎలాగంటే.. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ గ్రేడ్ సీ ప్లేయర్ల లిస్టులో ఉన్న చాహార్‌కు ఇన్సురెన్స్ పాలసీ కారణంగా వేలంలో దక్కించుకున్న పూర్తి మొత్తం లభించనుంది.

బీసీసీఐ స్వయంగా తమ కాంట్రాక్ట్ ప్లేయర్ల ప్రీమియం మొత్తం చెల్లిస్తుంది. దీంతో బీసీసీఐ పుణ్యమా అని దీపక్ చాహార్‌కు ఒక్క మ్యాచ్‌ ఆడకపోయినా ఇంచుమించు రూ.14 కోట్ల మొత్తం లభించనుంది. ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా, ఐపీఎల్‌కు ముందు వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20 సందర్భంగా దీపక్‌ చాహర్‌ గాయపడిన విషయం తెలిసిందే. 
చదవండి: ఔటైన కోపంలో ఇషాన్ కిష‌న్ ఏం చేశాడంటే.. వీడియో వైర‌ల్‌

మరిన్ని వార్తలు