కెప్టెన్‌తో గొడవ.. టీమ్‌ నుంచి వెళ్లిపోయిన ఆల్‌రౌండర్‌

10 Jan, 2021 17:06 IST|Sakshi

ఢిల్లీ: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ప్రారంభానికి ముందే బరోడా టీమ్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఆదివారం నుంచి టోర్నీ ప్రారంభం అవుతుండగా జట్టు సీనియర్ ఆల్‌రౌండర్ దీపక్ హుడా..కెప్టెన్ కృనాల్ పాండ్యాతో గొడవ కారణంగా క్యాంప్ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయాడు. బరోడా టీమ్‌కి కృనాల్ పాండ్యా  కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. గతంలో ఈ టీమ్‌కి కెప్టెన్‌‌గా పనిచేసిన దీపక్ హుడా ప్రస్తుతం వైస్ కెప్టెన్ హోదాలో ఉన్నాడు.కాగా క్యాంప్‌ నుంచి వెళ్లిన అనంతరం తాను టీమ్‌ నుంచి వెళ్లిపోవడానికి గల కారణాన్ని దీపక్‌ హుడా ఈ మెయిల్‌ ద్వారా బరోడా క్రికెట్‌ అసోసియేషన్‌కు వివరించాడు. (చదవండి: బుమ్రా చేసిన పనికి షాక్‌ తిన్న అంపైర్‌)

'ఇటీవల జరిగిన టీమ్ సమావేశాల్లో పదే పదే నన్ను టార్గెట్ చేస్తూ కృనాల్ పాండ్యా దూషిస్తున్నాడు. తాను ఒక సీనియర్‌ ఆటగాడినేనని.. భారత్ జట్టుతో పాటు ఐపీఎల్‌లోనూ పలు జట్లకు ప్రాతినిధ్యం వహించాను. గతంలో ఇదే బరోడా జట్టకు కెప్టెన్‌గా పనిచేసిన నేను ఇప్పుడు వైస్‌ కెప్టెన్‌ హోదాలో ఏదైనా సలహా ఇచ్చినా కృనాల్‌ దానిని స్వీకరించడం లేదు. పైగా జట్టు సహచరుల ముందే నన్ను దూషించడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. గతంలో ఎన్నో జట్లకు ఆడాను.. ఒక ఆటగాడిగా చాలా మంది కెప్టెన్సీలో పనిచేశాను.. కానీ కృనాల్‌ పాండ్యా తరహా వేధింపులు ఎక్కడా ఎదుర్కోలేదు. కేవలం  కృనాల్ బ్యాడ్ బిహేవియర్ కారణంగానే టీమ్ క్యాంప్ నుంచి బయటికి వెళ్లిపోయానంటూ ' దీపక్‌ హుడా ఆవేదన వ్యక్తం చేశాడు.

అయితే వీరిద్దరి గొడవపై ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా బరోడా టీమ్ మేనేజర్‌ని బరోడా క్రికెట్ అసోసియేషన్ కోరింది. కృనాల్ పాండ్యా టీమిండియాకి ఆడాడు. 2018లో భారత్ తరఫున టీ20ల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఆల్‌రౌండర్ ఇప్పటి వరకూ 18 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మరోవైపు దీపక్ హుడా భారత్ జట్టులోకి 2017-18లో భారత టీ20 జట్టులోకి ఎంపికయ్యాడు. కానీ.. తుది జట్టులో మాత్రం అవకాశం దక్కించుకోలేకపోయాడు. ఇక ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున కృనాల్ పాండ్యా ఆడుతుండగా.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కి ఐపీఎల్ 2020 సీజన్‌లో దీపక్ హుడా ఆడాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బయో- సెక్యూర్ వాతావరణంలో ఈ ట్రోఫీని బీసీసీఐ నిర్వహించనుంది. ముస్తాక్‌ అలీ ట్రోపీలో 38 జట్లు క్వారంటైన్‌లో ఉండి బయో బబుల్‌లోకి వచ్చాయి. కృనాల్‌తో గొడవ కారణంగా  క్యాంప్ నుంచి వెళ్లిపోయిన దీపక్ హుడా మళ్లీ జట్టులోకి రావాలంటే.. 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి కానుంది.(చదవండి: ఒకవేళ అక్కడ సచిన్‌ ఉంటే పరిస్థితి ఏంటి?)

మరిన్ని వార్తలు