Deepthi Sharma: చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. టీమిండియా తొలి బౌలర్‌గా

15 Feb, 2023 21:12 IST|Sakshi

భారత మహిళా క్రికెటర్‌ దీప్తి శర్మ టి20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించింది. టీమిండియా తరపున అటు పురుషుల క్రికెట్‌లో.. ఇటు మహిళల క్రికెట్‌లో టి20ల్లో వంద వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కింది. మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆరీ ఫ్లెచర్‌ను ఔట్‌ చేయడం ద్వారా దీప్తి శర్మ ఈ ఘనత సాధించింది. ఓవరాల్‌గా దీప్తి శర్మ 89 టి20 మ్యాచ్‌ల్లో వంద వికెట్ల మార్క్‌ను అందుకుంది.

ఈ ఘనత సాధించిన తొలి టీమిండియా మహిళా క్రికెటర్‌గానూ చరిత్రకెక్కింది. టీమిండియా మహిళా వెటరన్‌ లెగ్‌ స్పిన్నర్‌ పూనమ్‌ యాదవ్‌ 72 మ్యాచ్‌ల్లో 98 వికెట్లతో రెండో స్థానంలో ఉంది. టి20 క్రికెట్‌లో వంద వికెట్ల మైలురాయిని అందుకున్న మహిళా క్రికెటర్ల జాబితాలో దీప్తి శర్మ తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇక మహిళల టి20 క్రికెట్‌లో సీనియర్‌ వెస్టిండీస్‌ స్పిన్నర్‌ అనీసా మహ్మద్‌ 125 వికెట్లు(117 మ్యాచ్‌లు) తొలి స్థానంలో ఉంది.  ఆ తర్వాత  పాకిస్తాన్‌ బౌలర్‌ నిదాదార్‌(121 వికెట్లు), ఆస్ట్రేలియాకు చెందిన ఎలిస్‌ పెర్రీ (120 వికెట్లు) వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.

ఇక టీమిండియా మెన్స్‌ క్రికెటర్లలో యజ్వేంద్ర చహల్‌ 91 వికెట్లతో(75 మ్యాచ్‌లు) వంద వికెట్లకు చేరువగా ఉన్నాడు.  ఆ తర్వాతి స్థానంలో భువనేశ్వర్‌ కుమార్‌ 90 వికెట్లు(87 మ్యాచ్‌లు) రెండో స్థానంలో ఉన్నాడు. పురుషుల టి20 క్రికెట్‌లో వంద వికెట్ల మార్క్‌ను ఐదుగురు మాత్రమే అందుకున్నారు. టిమ్‌ సౌథీ 134 వికెట్లు(107 మ్యాచ్‌లు), షకీబ్‌ అల్‌ హసన్‌ 128 వికెట్లు(109 మ్యాచ్‌లు), రషీద్‌ ఖాన్‌ 122 వికెట్లు(74 మ్యాచ్‌లు), ఇష్‌ సోదీ 114 వికెట్లు( 91 మ్యాచ్‌లు), లసిత్‌ మలింగ 107 వికెట్లు( 84 మ్యాచ్‌లు) ఉన్నారు.

చదవండి: Smriti Mandana: వచ్చీ రావడంతో స్టన్నింగ్‌ క్యాచ్‌తో..

మరిన్ని వార్తలు