ధోని, కోహ్లి వల్ల కూడా కాలేదు.. అరుదైన రికార్డు నెలకొల్పిన టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌

14 Feb, 2023 12:18 IST|Sakshi

Deepti Sharma: భారత మహిళా క్రికెటర్‌ దీప్తి శర్మ అరుదైన రికార్డు నెలకొల్పింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకి​స్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ బరిలోకి దిగడం ద్వారా ఈ టీమిండియా ఆల్‌రౌండర్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఇంతకు ఏంటా రికార్డు అంటే..? రైట్‌ హ్యాండ్‌ ఆఫ్‌ బ్రేక్‌ బౌలర్‌, లెఫ్ట్‌ హ్యాండ్‌ డాషింగ్‌ బ్యాటర్‌ అయిన దీప్తి శర్మ.. వరుసగా 50కి పైగా (2016-21 మధ్యలో 54) వన్డేలు, 50 టీ20లు (2020-23) ఆడిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది.

భారత పురుష క్రికెటర్లు, అత్యంత ఫిట్‌గా ఉండే విరాట్‌ కోహ్లి, మాజీ సారధి మహేంద్ర సింగ్‌ ధోనికి సైతం సాధ్యం కాని ఈ రికార్డును దీప్తి తన ఖాతాలో వేసుకుని ఔరా అనిపించింది. భారత్‌ తరఫున ఏ పురుష క్రికెటర్‌కు కాని మహిళా క్రికెటర్‌కు కాని సాధ్యం కాని ఈ రికార్డును దీప్తి తన పేరిట లిఖించుకుని శభాష్‌ అనిపించుకుంది. 25 ఏళ్ల దీప్తి ఇప్పటివరకు తన అంతర్జాతీయ కెరీర్‌లో 2 టెస్ట్‌లు, 80 వన్డేలు, 87 టీ20లు ఆడింది. ఇందులో 152 టెస్ట్‌ పరుగులు, 1891 వన్డే పరుగులు, 914 టీ20 పరుగులు సాధించింది.

బౌలింగ్‌లో 5 టెస్ట్‌ వికెట్లు, 91 వన్డే వికెట్లు, 96 టీ20 వికెట్లు దీప్తి ఖాతాలో ఉన్నాయి. దీప్తి ఇప్పటివరకు వన్డేల్లో ఓ సెంచరీ, 12 హాఫ్‌ సెంచరీలు, టెస్ట్‌ల్లో 2 హాఫ్‌ సెంచరీలు, టీ20ల్లో 2 హాఫ్‌ సెంచరీలు చేసింది. వన్డేల్లో ఓసారి 5 వికెట్లు, 2 సార్లు 4 వికెట్లు, టీ20ల్లో ఓ సారి 4 వికెట్ల ఘనత దీప్తి ఖాతాలో ఉన్నాయి.

కాగా, నిన్న (ఫిబ్రవరి 13) జరిగిన మహిళల తొట్టతొలి ఐపీఎల్‌ మెగా వేలంలో దీప్తి రికార్డు ధరను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. యూపీ వారియర్జ్‌ దీప్తిని 2.6 కోట్టు వెచ్చించి సొంతం చేసుకుంది. యూపీ వారియర్జ్‌ తరఫున దీప్తినే అత్యధిక ధర పలికిన ప్లేయర్‌ కావడం​ విశేషం.

ఓవరాల్‌గా చూస్తే వేలంలో అత్యధిక ధర రికార్డును టీమిండియా డాషింగ్‌ ఓపెనర్‌ స్మృతి మంధన సొంతం చేసుకుంది. మంధనను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 3.4 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుంది. మంధనను దక్కిన మొత్తం పాకిస్తాన్‌లో జరిగే పీఎస్‌ఎల్‌లో స్టార్‌ ఆటగాళ్లకు లభించే మొత్తంతో పోలిస్తే రెండింతలకు ఎక్కువ. పీఎస్‌ఎల్‌ పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌కు లభించే 1.2 కోట్లే అత్యధికం.    
 

మరిన్ని వార్తలు