IND W Vs ENG W: ఇన్నింగ్స్‌ చివర్లో హైడ్రామా.. 'మరో అశ్విన్‌'లా కనబడింది

25 Sep, 2022 07:26 IST|Sakshi

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌ను టీమిండియా 16 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. లార్డ్స్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిచి మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడమే గాక చివరి మ్యాచ్‌ ఆడిన ఝులన్‌ గోస్వామికి విజయాన్ని కానుకగా అందించింది. అయితే ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ చివర్లో హైడ్రామా నెలకొంది. 

ఇంగ్లండ్‌ చివరి వికెట్‌ వివాదాస్పదమైంది. దీప్తి శర్మ బంతి వేయకముందే నాన్‌ స్ట్రయికర్‌ ఎండ్‌లో ఇంగ్లండ్‌ బ్యాటర్‌ చార్లీ డీన్‌ (47; 5 ఫోర్లు) క్రీజు దాటి ముందుకు వెళ్లింది. యాక్షన్‌ పూర్తి చేసిన దీప్తి వెంటనే వికెట్లను గిరాటేసింది. దాంతో చార్లీ డీన్‌ను అంపైర్‌ రనౌట్‌గా ప్రకటించడంతో భారత విజయం ఖాయమైంది. ఇలా ఔట్‌ చేయడాన్ని మన్కడింగ్‌ అంటారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మన్కడింగ్‌పై క్రికెట్‌ వర్గాల్లో పెద్ద చర్చే నడిచింది. కానీ ఇటీవలే క్రికెట్‌లో చట్టాలు చేసే మెరిల్‌బోర్న్‌ క్రికెట్‌ క్లబ్‌(ఎంసీసీ) మన్కడింగ్‌ను చట్టబద్ధం చేసింది. దీంతో మన్కడింగ్‌ ఇకపై రనౌట్‌గా పిలవనున్నారు. ఐసీసీ కూడా దీనికి ఆమోదముద్ర వేసింది. కాగా అక్టోబర్‌ 1 నుంచి క్రికెట్‌లో మన్కడింగ్(రనౌట్‌) సహా పలు కొత్త రూల్స్‌ అమలు కానున్నాయి. ఇక ఐపీఎల్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌.. రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు జాస్‌ బట్లర్‌ను మన్కడింగ్‌ చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది. తాజాగా టీమిండియా నుంచి అశ్విన్‌ తర్వాత మన్కడింగ్‌ చేసిన బౌలర్‌గా దీప్తి శర్మ నిలిచింది. దీంతో క్రికెట్‌ అభిమానులు.. ''ఇవాళ దీప్తి శర్మ మరో అశ్విన్‌లా కనబడింది.. తగ్గేదే లే'' అంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: జులన్‌కు క్లీన్‌స్వీప్‌ కానుక

మరిన్ని వార్తలు