Babar Azam: టీమిండియాకు షాకివ్వడమే గతేడాదికి అత్యుత్తమం 

2 Jan, 2022 18:30 IST|Sakshi

ఇస్లామాబాద్‌: టీ20 ప్రపంచకప్‌ 2021లో టీమిండియాను ఓడించడమే గతేడాదికి అత్యుత్తమమని పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ పేర్కొన్నాడు. తాజాగా పాక్‌ క్రికెట్‌ బోర్డు పోడ్‌కాస్ట్‌తో మాట్లాడుతూ.. బాబర్‌ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. దుబాయ్‌ వేదికగా గతేడాది అక్టోబర్‌ 24న జరిగిన హై ఓల్టేజీ పోరులో కోహ్లి సేనపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడం చిరస్మరణీయమని అన్నాడు. ప్రపంచకప్‌ టోర్నీల్లో(టీ20, వన్డే) టీమిండియాను తొలిసారిగా ఓడించడం ప్రత్యేక అనుభూతిని మిగిల్చిందని తెలిపాడు. 

కాగా, భారీ అంచనాల నడుమ టీ20 ప్రపంచకప్‌-2021 వేదికగా జరిగిన దాయాదుల పోరులో టీమిండియా ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. కోహ్లి(49 బంతుల్లో 57) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.

అనంతరం పాక్‌ ఓపెనర్లు బాబార్‌ ఆజమ్‌, మహ్మద్‌ రిజ్వాన్‌ చెలరేగడంతో పాక్‌ వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఈ ఓటమితో టీమిండియా ప్రపంచకప్‌ సెమీస్‌ బెర్తును సంక్లిష్టం చేసుకోగా.. గ్రూప్‌ స్టేజీలో అజేయ జట్టుగా నిలిచిన పాక్‌ సెమీస్‌లో ఆసీస్‌ చేతిలో చతికిలబడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. 
చదవండి: అతి త్వరలో అతన్ని టీమిండియా నుంచి సాగనంపడం ఖాయం..!

మరిన్ని వార్తలు