Ranji Trophy 2022-23: 43 ఏళ్లలో తొలిసారి.. ముంబై జట్టుకు ఘోర అవమానం

20 Jan, 2023 16:44 IST|Sakshi

రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో ఢిల్లీ జట్టు తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. 41సార్లు రంజీ చాంపియన్‌గా నిలిచిన ముంబైని ఢిల్లీ జట్టు 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 43 ఏళ్లలో ముంబై జట్టుపై ఢిల్లీకిదే తొలి విజయం కావడం విశేషం. తాజా మ్యాచ్‌తో కలిపి ఢిల్లీ  ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లకు గానూ మూడింటిని డ్రా చేసుకొని.. రెండింటిలో ఓటమిపాలైంది. తాజాగా ముంబైపై విజయంతో సీజన్‌లో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.  88 ఏళ్ల రంజీ ట్రోఫీ చ‌రిత్ర‌లో ముంబై, ఢిల్లీ చేతిలో ఓడిపోవ‌డం ఇది రెండోసారి మాత్ర‌మే.

గ్రూప్‌-బిలో ఉన్న ఢిల్లీ ప్రస్తుతం ఏడో స్థానంలో ఉంది. ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 293 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌట్‌ అయింది. దీంతో ఢిల్లీకి 76 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ముంబై 170 పరుగులకే కుప్పకూలింది.

దీంతో ఢిల్లీ ముందు 97 పరుగుల స్వల్ప టార్గెట్‌ ఉండడంతో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ముంబై తరపున సర్ఫరాజ్‌ ఖాన్‌ ఒక్కడే మెరుగ్గా రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన సర్ఫరాజ్‌ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం డకౌట్‌ అయ్యాడు.ముంబై కెప్టెన్‌ అజింక్యా రహానే సహా ఓపెనర్‌ పృథ్వీ షాలు మ్యాచ్‌లో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు.  ఇక ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఢిల్లీ బ్యాటర్‌ వైభవ్‌ రవాల్‌ నిలిచాడు. 

చదవండి: స్లో ఓవర్‌ రేట్‌.. టీమిండియాకు పడింది దెబ్బ

కౌంటీల్లో ఆడనున్న స్మిత్‌! ద్రోహులు అంటూ ఫైర్‌! తప్పేముంది?

మరిన్ని వార్తలు