సిక్సర్ల హోరులో ఢిల్లీ విన్నర్‌

3 Oct, 2020 23:43 IST|Sakshi

షార్జా:  ఈ ఐపీఎల్‌ సీజన్‌లో మరోసారి పరుగుల మోత మోగింది. ఢిల్లీ క్యాపిటల్స్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ పరుగుల మోతకు వేదికయ్యింది. ముందుగా ఊహించినట్లే షార్జాలో ఇరుజట్లు పరుగుల హోరులో తడిసిపోయాయి. ఈ ఉత్కంఠ భరితమైన పోరులో చివరకు ఢిల్లీ క్యాపిటల్స్‌ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ, కేకేఆర్‌లు తలో 14 సిక్స్‌లు కొట్టడం విశేషం.

ఢిల్లీ నిర్దేశించిన 229 పరుగుల టార్గెట్‌లో కేకేఆర్‌ ఎనిమిది వికెట్లు కోల్పోయి 210  పరుగులకే పరిమితమయ్యింది. కేకేఆర్‌ ఆటగాళ్లలో గిల్‌(28; 22 బంతుల్లో 2ఫోర్లు, 1 సిక్స్‌), నితీష్‌ రాణా(58; 35 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), మోర్గాన్‌(44;18 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్స్‌లు), రాహుల్‌ త్రిపాఠి(36; 16 బంతుల్లో 3 ఫోర్లు, 3సిక్స్‌లు)లు మెరుపులు మెరిపించినా జట్టును గెలిపించలేకపోయారు. భారీ లక్ష్య ఛేదన కావడంతో కేకేఆర్‌ పోరాడి ఓడిపోయింది. ప్రధానంగా సునీల్‌ నరైన్‌(3), ఆండ్రీ రసెల్‌(13), దినేశ్‌ కార్తీక్‌(6)లు విఫలం కావడంతో కేకేఆర్‌ ఓటమి కారణమైంది. ఢిల్లీ బౌలర్లలో నోర్త్‌జే మూడు వికెట్లు సాధించగా, హర్షల్‌ పటేల్‌ రెండు వికెట్లు సాధించాడు. రబడా, స్టోయినిస్‌, మిశ్రాలు తలో వికెట్‌ తీశారు. ఓ దశలో మోర్గాన్‌-త్రిపాఠిలు బ్యాట్‌ ఝుళిపించడంతో ఢిల్లీ గుండెల్లో దడపుట్టింది. కాగా, మోర్గాన్‌ నోర్త్‌జే ఔట్‌ చేయడం, ఆపై త్రిపాఠిని స్టోయినిస్‌ బౌల్డ్‌ చేయడంతో కేకేఆర్‌ ఓటమి ఖాయమైంది. (చదవండి: మ్యాజికల్‌ పడిక్కల్‌.. తొలి ప్లేయర్‌గా రికార్డు)

మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. పృథ్వీ షా(66; 41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌(88 నాటౌట్‌; 38 బంతుల్లో 7ఫోర్లు, 6 సిక్స్‌లు), రిషభ్‌ పంత్‌( 38; 17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌)లు రాణించడంతో ఢిల్లీ భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోవడంతో ఢిల్లీ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌ను  పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌లు ధాటిగా ఆరంభించారు. పృథ్వీ షా ఆది నుంచి కేకేఆర్‌ బౌలర్లపై దాడికి దిగాడు. ఈ జోడి 56 పరుగులు జత చేసిన తర్వాత ధావన్‌(26; 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆ తరుణంలో పృథ్వీషాకు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ జత కలిశాడు. 

ఈ జోడి 73 పరుగులు జత చేసిన తర్వాత పృథ్వీ షా రెండో వికెట్‌గా ఔటయ్యాడు. నాగర్‌కోటి బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయిన పృథ్వీ షా.. శుబ్‌మన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. అనంతరం అయ్యర్‌-పంత్‌ల జోడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ప్రతీ ఓవర్‌లో కనీసం పది పరుగులు ఉండాలనే లక్ష్యంతో వీరిద్దరూ బ్యాటింగ్‌ చేశారు. ఒక ఫోర్‌ కొడితే, మరొకరు సిక్స్‌ అన్నట్లు వీరి బ్యాటింగ్‌ సాగింది. ఈ జోడి 90 పరుగులు జత చేయడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. కేకేఆర్‌ బౌలర్లలో నాగర్‌కోటి, వరుణ్‌ చక్రవర్తిలకు తలో వికెట్‌ దక్కింది. ఈ మ్యాచ్‌లో ప్యాట్‌ కమిన్స్‌ 49 పరుగులు ఇవ్వగా, మావి 3 ఓవర్లలో 40 పరుగులిచ్చాడు. ఇక నాగర్‌కోటి మూడు ఓవర్లు వేసి 35 పరుగులిచ్చాడు. వరుణ్‌ చక్రవర్తి తన నాలుగు ఓవర్ల కోటాలో 49 పరుగులు సమర్పించుకున్నాడు. రసెల్‌ ఒక్కడే 4 ఓవర్లలో రెండు వికెట్లు సాధించి 29 పరుగులిచ్చాడు.

మరిన్ని వార్తలు