ఢిల్లీ క్యాపిటల్స్‌ డబుల్‌ ధమాకా

14 Oct, 2020 23:14 IST|Sakshi

దుబాయ్‌:  రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ 161 పరుగుల స్కోరును కాపాడుకుని జయకేతనం ఎగురువేసింది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో రాజస్తాన్‌ రాయల్స్‌కు మరో ఓటమి తప్పలేదు. ఈ సీజన్‌లో ఇరు జట్ల మధ్య జరిగిన ఫస్ట్‌ లెగ్‌ మ్యాచ్‌లో విజయాన్ని సాధించిన ఢిల్లీ.. మళ్లీ రాజస్తాన్‌పై పైచేయి సాధించి డబుల్‌ ధమాకా కొట్టింది.  ఢిల్లీ నిర్దేశించిన 162 పరుగుల టార్గెట్‌లో రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ను జోస్‌ బట్లర్‌(22;9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌), బెన్‌ స్టోక్స్‌(41; 35 బంతుల్లో 6 ఫోర్లు) ధాటిగా ఆరంభించారు.  రాజస్తాన్‌ జట్టు మూడు ఓవర్లలో  37 పరుగులు సాధించిన తర్వాత బట్లర్‌ తొలి వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై కాసేపటికి స్టీవ్‌ స్మిత్‌(1) పెవిలియన్‌ చేరాడు. బట్లర్‌ను నోకియా బౌల్డ్‌ చేయగా, స్మిత్‌ను అశ్విన్‌ బోల్తా కొట్టించాడు. అశ్విన్‌ నాల్గో ఓవర్‌ ఆఖరి బంతికి స్మిత్‌ తడబడి రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.  

ఆ తరుణంలో స్టోక్స్‌కు శాంసన్‌ జత కలిశాడు. కాగా, స్టోక్స్‌ను తుషార్‌ దేశ్‌పాండే ఔట్‌ చేయగా, ఆపై స్వల్ప వ్యవధిలో మంచి టచ్‌లో కనిపించిన శాంసన్‌(25;18 బంతుల్లో 2 సిక్స్‌లు) ఔటయ్యాడు.  రాబిన్‌ ఊతప్ప(32; 27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) కాసేపు మెరుపులు మెరిపించినా నోకియా బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. ఇక తెవాటియా(14 నాటౌట్‌) చివరి వరకూ క్రీజ్‌లో ఉన్నా మ్యాచ్‌ను గెలిపించలేకపోయాడు. రాజస్తాన్‌ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఢిల్లీ బౌలర్లలో నోకియా, దేశ్‌పాండేలు తలో రెండు వికెట్లు సాధించగా, రబడా, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌లు తలో వికెట్‌ తీశారు.ఇది ఢిల్లీకి ఆరో విజయం కాగా, రాజస్తాన్‌కు ఐదో ఓటమి.

ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది.  శిఖర్‌ ధావన్‌(57; 33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శ్రేయస్‌ అయ్యర్‌(53; 43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా, మిగతా వారు విఫలయ్యారు. స్టోయినిస్‌(18), అలెక్స్‌ క్యారీ(14)లు నిరాశపరచడంతో ఢిల్లీ సాధారణ స్కోరుకు పరిమితమైంది.   టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఏంచుకున్న ఢిల్లీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జోఫ్రా ఆర్చర్‌ వేసిన మొదటి ఓవర్‌లో మొదటి బంతికే పృథ్వీ షా డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో సున్నా పరుగుకే ఢిల్లీ తొలి వికెట్‌ కోల్పోయింది. అనంతరం వచ్చిన రహానే ఆర్చర్‌ బంతులను ఎదుర్కోవడంలో బాగా ఇబ్బంది పడ్డాడు. ఈ నేపథ్యంలనే రెండో ఓవర్‌ వేసిన ఆర్చర్‌ మూడో బంతికి రహానేను అవుట్‌ చేశాడు. దీంతో 10 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. తొలి స్పెల్‌లో జోఫ్రా ఆర్చర్‌ ప్రతీ బంతిని 140 కిమీ పైనే స్పీడుతో వేయడం విశేషం. తొలి స్పెల్‌లో రెండు ఓవర్లు వేసిన ఆర్చర్‌ కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. రహానే అవుట్‌తో క్రీజులోకి వచ్చిన అయ్యర్‌తో కలిసి మరో వికెట్‌ పడకుండా మరో ఓపెనర్‌ ధవన్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు.

కార్తిక్‌ త్యాగి వేసిన 6వ ఓవర్లో ధవన్‌ బౌండరీలతో విరుచుకుపడడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఢిల్లీ రెండు వికెట్ల నష్టానికి 47 పరుగులు సాధించింది. ధవన్‌ 30 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్న కాసేపటికే శ్రేయాస్‌ గోపాల్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు . ఆ తర్వాత అయ్యర్‌ కొన్ని మంచి షాట్లు ఆడి 43 బంతుల్లో అర్థసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ దశలో అయ్యర్‌ స్కోరు పెంచే యత్నంలో త్యాగి బౌలింగ్‌లో 53 పరుగుల వద్ద క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. అయ్యర్‌ వెనుదిరిగాక రాజస్తాన్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో మూడు ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా నమోదు కాలేదు. ఉనాద్కట్‌ వేసిన ఆఖరి ఓవర్లో ఒక బౌండరీ మాత్రమే రావడం గమనార్హం.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు