-

ప్లే ఆఫ్స్‌కు ఢిల్లీ వెళ్లింది.. బెంగళూరునూ తీసుకెళ్లింది

3 Nov, 2020 05:20 IST|Sakshi

రాణించిన ధావన్, రహానే

బంతితో మెరిసిన నోర్జే, రబడ

ఆరు వికెట్లతో కోహ్లి సేనపై ఢిల్లీ గెలుపు

కోల్‌కతా ఆశలు సన్‌రైజర్స్‌ చేతిలో

రన్‌రేట్‌తో పనిలేకుండా... ఇతర జట్లతో సంబంధం లేకుండా ఢిల్లీ క్యాపిటల్స్‌ దర్జాగా ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లింది. గత నెల 17వ తేదీ వరకే క్యాపిటల్స్‌ 7 మ్యాచ్‌ల్ని గెలిచింది. ఇంకా ఐదు మ్యాచ్‌లుండగానే బెర్త్‌ ఖాయమనుకున్నారంతా! కానీ అటుమీదట వరుసగా ఓడిపోవడంతో... ‘బెంగ’తో ఇప్పుడీ ఆఖరి పోరాటం తప్పలేదు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఎనిమిదో విజయంతో రెండో స్థానానికి ఎగబాకింది. లీగ్‌లో వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ బెంగళూరు ఓడినప్పటికీ ఢిల్లీ ఛేజింగ్‌ నెమ్మదిగా ఉండటంతో కోహ్లి బృందం తమ రన్‌రేట్‌ను
 కోల్‌కతా నైట్‌రైడర్స్‌కంటే మెరుగుపర్చుకొని ప్లే ఆఫ్స్‌కు చేరింది.

అబుదాబి: ఢిల్లీ తమ పరాజయాల పరంపరకు అవసరమైన దశలో చెక్‌ పెట్టింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో (ఆర్‌సీబీ) కీలకమైన ఈ మ్యాచ్‌లో గెలిచి ముంబై సరసన నిలిచింది. దీంతో పాయింట్ల పట్టకిలో టాప్‌–2లో నిలిచిన ఈ రెండు జట్లకు ప్లే ఆఫ్స్‌లో ఒక మ్యాచ్‌లో ఓడినా... ఫైనల్‌ చేరేందుకు రెండో దారి (క్వాలిఫయర్‌–2) ఉంటుంది. ఈనెల 5న జరిగే తొలి క్వాలిఫయర్‌లో ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆడుతుంది. 6న జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో బెంగళూరుతో తలపడే ప్రత్యర్థి కోల్‌కతానా, హైదరాబాదా నేడు తేలుతుంది.

సోమవారం జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆరు వికెట్ల తేడాతో బెంగళూరుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. దేవ్‌దత్‌ పడిక్కల్‌ (41 బంతుల్లో 50; 5 ఫోర్లు) రాణించాడు. డివిలియర్స్‌ (21 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడాడు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నోర్జే 3 వికెట్లు తీయగా...రబడ ఖాతాలో రెండు వికెట్లు పడ్డాయి. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్‌ 19 ఓవర్లలో 4 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. ఒకవేళ ఢిల్లీ జట్టు లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోపే ఛేదించి ఉంటే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రన్‌రేట్‌ కంటే బెంగళూరు జట్టుది తక్కువ అయ్యేది.  

విరాట్‌ విఫలం...
ముందుకెళ్లెందుకు, టాప్‌–2ను పదిల పరుచుకునేందుకు  ఆఖరి అవకాశమైన మ్యాచ్‌లోనూ కెప్టెన్‌ కోహ్లి సత్తా చాటలేకపోయాడు. ఆట మొదలైన కాసేపటికే ఓపెనర్‌ ఫిలిప్‌ (12) ఔటయ్యాడు. దేవ్‌దత్‌ చక్కగా ఆడుతుండగా... కెప్టెన్‌ కోహ్లితో జతయ్యాడు. కానీ ఆశించినంత వేగంగా మాత్రం ఇన్నింగ్స్‌ సాగలేదు. అక్షర్‌ పటేల్‌ వేసిన 12వ ఓవర్లో కవర్స్‌ మీదుగా సిక్సర్‌ కొట్టిన కోహ్లి కాసేపటికే అశ్విన్‌ బౌలింగ్‌లో స్టొయినిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. క్రీజులోకి డివిలియర్స్‌ రాగా.. పడిక్కల్‌ 40 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు.  కానీ మరుసటి ఓవర్లోనే బెంగళూరుకు కోలుకోలేని దెబ్బలు తగిలాయి. నోర్జే చక్కని బంతులతో క్రీజులో పాతుకుపోయిన దేవ్‌దత్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేశాడు.

బంతి వ్యవధిలో అప్పుడే వచ్చిన మోరిస్‌ (0)ను డకౌట్‌ చేశాడు. ఒక ఓవర్లు దగ్గరపడుతుండటంతో ఏబీ డివిలియర్స్, శివమ్‌ దూబేలు తమ బ్యాట్లకు పనిచెప్పారు. డేనియల్‌ సామ్స్‌ వేసిన 18వ ఓవర్లో డివిలియర్స్‌ బౌండరీ కొట్టగా, దూబే సిక్స్, ఫోర్‌ కొట్టడంతో ఆ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. రబడ 19వ ఓవర్లో ఏబీ స్క్వేర్‌ లెగ్‌లో భారీ సిక్సర్‌ బాదాడు. దూబే ఎక్స్‌ట్రా కవర్లోకి బౌండరీ కొట్టాడు. కానీ మరో షాట్‌కు ప్రయత్నించి డీప్‌మిడ్‌ వికెట్‌లో రహానే చేతికి చిక్కాడు. ఆఖరి ఓవర్‌ను నోర్జే అద్భుతంగా కట్టడి చేశాడు. స్ట్రయిక్‌ కోసం లేని పరుగుకు ప్రయత్నించిన ఏబీ రనౌట్‌ కాగా... ఉదాన ఫోర్‌ కొట్టిన మరుసటి బంతికే ఔటయ్యాడు. దీంతో 20వ ఓవర్లో 7 పరుగులే వచ్చాయి.  

మెరిసిన ధావన్, రహానే...
ఢిల్లీ పరుగుల వేట ధాటిగా మొదలైంది. మోరిస్‌ తొలి ఓవర్లో  ధావన్‌ 2 బౌండరీలు కొట్టాడు. తర్వాత సిరాజ్‌ ఓవర్లో పృథ్వీ షా రెండు ఫోర్లు కొట్టాడు. కానీ సిరాజ్‌ అద్భుతమైన డెలివరీతో పృథ్వీ షాను బౌల్డ్‌ చేశాడు. బెంగళూరు శిబిరం ఆనందతాండవం చేసింది. కానీ అనుభవజ్ఞుడైన రహానే, సీనియర్‌ ఓపెనర్‌ ధావన్‌ నింపాదిగా ఆడటంతో బెంగళూరుకు కష్టాలు తప్పలేదు. ఇద్దరు అనవసర షాట్లకు వెళ్లకుండా ఒకట్రెండు పరుగులు తీస్తూనే అడపాదడపా బౌండరీలు కూడా బాదడంతో స్కోరు బోర్డు పరుగెత్తింది.

చేయాల్సిన రన్‌రేట్‌ను పడిపోకుండా ఇద్దరు బాధ్యతగా పరుగులు జతచేశారు. ఈ క్రమంలోనే ముందుగా ధావన్‌ 37 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత కాసేపటికే షాబాజ్‌ బౌలింగ్‌ స్వీప్‌ షాట్‌ ఆడబోయి దూబేకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (7)ను కూడా షాబాజే పెవిలియన్‌కు దారి చూపాడు. రహానే కూడా 37 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. ఆఖరి దశకు చేరుతున్న సమయంలో రహానే కూడా 18వ ఓవర్లో ఔట్‌ కావడంతో బెంగళూరులో ఆశలు చిగురించాయి. కానీ సిరాజ్‌ రెండు వైడ్లతో పాటు 8 బంతులు వేయడంతో స్టొయినిస్‌ 6, 4 కొట్టి ఓవర్‌కంటే ముందుగానే మ్యాచ్‌ ముగించాడు.

స్కోరు వివరాలు
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: ఫిలిప్‌ (సి) పృథ్వీ షా (బి) రబడ 12; దేవదత్‌ (బి) నోర్జే 50; కోహ్లి (సి) స్టొయినిస్‌ (బి) అశ్విన్‌ 29; డివిలియర్స్‌ (రనౌట్‌) 35; మోరిస్‌ (సి) పంత్‌ (బి) నోర్జే 0; శివమ్‌ దూబే (సి) రహానే (బి) రబడ 17; సుందర్‌ (నాటౌట్‌) 0; ఉదాన (సి) శ్రేయస్‌ (బి) నోర్జే 4; అహ్మద్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 152.  
వికెట్ల పతనం: 1–25, 2–82, 3–112, 4–12, 5–145, 6–146, 7–150.
బౌలింగ్‌: డేనియల్‌ సామ్స్‌ 4–0–40–0, రవిచంద్రన్‌ అశ్విన్‌ 4–0–18–1, నోర్జే 4–0–33–3, రబడ 4–0–30–2, అక్షర్‌ పటేల్‌ 4–0–30–0.  

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (బి) సిరాజ్‌ 9; శిఖర్‌ ధావన్‌ (సి) శివమ్‌ దూబే (బి) షాబాజ్‌ అహ్మద్‌ 54; రహానే (సి) శివమ్‌ దూబే (బి) సుందర్‌ 60; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) సిరాజ్‌ (బి) షాబాజ్‌ అహ్మద్‌ 7; రిషభ్‌ పంత్‌ (నాటౌట్‌) 8; స్టొయినిస్‌ (నాటౌట్‌) 10; ఎక్స్‌ట్రాలు  6; మొత్తం (19 ఓవర్లలో 4 వికెట్లకు) 154.
వికెట్ల పతనం:  1–19, 2–107, 3–130, 4–136.
బౌలింగ్‌: మోరిస్‌ 2–0–19–0, సిరాజ్‌ 3–0–29–1, సుందర్‌ 4–0–24–1, ఉదాన 2–0–24–0, చహల్‌ 4–0–29–0, షాబాజ్‌ నదీమ్‌ 4–0–26–2.   

మరిన్ని వార్తలు