Delhi Vs RR: ఢిల్లీ ధమాకా... రాణించిన శ్రేయస్‌ అయ్యర్, నోర్జే

26 Sep, 2021 04:17 IST|Sakshi

రాజస్తాన్‌ రాయల్స్‌పై 33 పరుగులతో విజయం

రాణించిన శ్రేయస్‌ అయ్యర్, నోర్జే

సామ్సన్‌ పోరాటం వృథా

అబుదాబి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టి20 టోర్నీ తాజా సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జోరు కనబరుస్తోంది. రాజస్తాన్‌ రాయల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన ఢిల్లీ 33 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకొని ప్లే ఆఫ్స్‌కు చేరువైంది. తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శ్రేయస్‌ అయ్యర్‌ (32 బంతుల్లో 43; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఆకట్టుకోగా... హెట్‌మైర్‌ (16 బంతుల్లో 28; 5 ఫోర్లు), రిషభ్‌ పంత్‌ (24 బంతుల్లో 24; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ముస్తఫిజుర్‌ (2/22), చేతన్‌ సకారియా (2/33) రాణించారు. ఛేదనలో రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 121 పరుగులు చేసి ఓడిపోయింది. కెపె్టన్‌ సంజూ సామ్సన్‌ (53 బంతుల్లో 70 నాటౌట్‌; 8 ఫోర్లు, సిక్స్‌) జట్టు విజయం కోసం ఒంటరి పోరాటం చేశాడు. అన్రిచ్‌ నోర్జే 2 వికెట్లు తీశాడు.

అయ్యర్‌ కీలక ఇన్నింగ్స్‌
టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ సారథి సామ్సన్‌ ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. పిచ్‌ మందకొడిగా ఉండటంతో పరుగులు సాధించేందుకు ఢిల్లీ ఓపెనర్లు పృథ్వీ షా (10), శిఖర్‌ ధావన్‌ (8; 1 ఫోర్‌) కష్టపడ్డారు. పృథ్వీ షా స్వేచ్ఛగా షాట్లను ఆడలేకపోయాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హీరోగా నిలిచిన కార్తీక్‌ త్యాగి ధావన్‌ రూపంలో రాజస్తాన్‌కు తొలి వికెట్‌ను అందించాడు. మరికాసేపటికే పృథ్వీ షా కూడా పెవిలియన్‌ చేరాడు. ఈ సమయంలో క్రీజులో ఉన్న శ్రేయస్‌ అయ్యర్‌ కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. పిచ్‌కు తగ్గట్టు తన ఆటను మార్చుకున్న అతడు భారీ షాట్ల జోలికి పోకుండా సింగిల్స్, డబుల్స్‌కు ప్రాధాన్యమిచ్చాడు. మరో ఎండ్‌లో ఉన్న కెపె్టన్‌ పంత్‌ కూడా స్ట్రయిక్‌ రొటేట్‌ చేసేందుకే మొగ్గు చూపాడు.

కుదురుకున్నాక బ్యాటింగ్‌ గేర్‌ మార్చిన శ్రేయస్‌ అయ్యర్‌ వరుస ఓవర్లలో రెండు సిక్సర్లు బాది స్కోరు బోర్డును పెంచే ప్రయత్నం చేశాడు. ముస్తఫిజుర్‌ బౌలింగ్‌లో వికెట్ల మీదకు ఆడుకున్న పంత్‌ పెవిలియన్‌కు చేరాడు. దాంతో 62 పరుగుల మూడో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే తెవాటియా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన శ్రేయస్‌ అయ్యర్‌ స్టంపౌట్‌ అయ్యాడు. హెట్‌మైర్‌ క్రీజులోకి రాగానే దూకుడు ప్రదర్శించాడు. 15వ ఓవర్‌లో రెండు ఫోర్లు... 16వ ఓవర్‌లో మరో మూడు ఫోర్లు బాది ఢిల్లీకి భారీ స్కోరును అందించేలా కనిపించాడు. అయితే ముస్తఫిజుర్‌ బౌలింగ్‌లో అతడు అవుటయ్యాడు. అనంతరం ధాటిగా ఆడే బ్యాట్స్‌మెన్‌ లేకపోవడంతో ఢిల్లీ 154 పరుగులకు పరిమితమైంది.

సామ్సన్‌ మినహా...
ఛేదనలో రాజస్తాన్‌ జట్టు ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్లు లివింగ్‌స్టోన్‌ (1), యశస్వి జైస్వాల్‌ (5), మిల్లర్‌ (7) అలా వచ్చి ఇలా వెళ్లారు. దాంతో రాజస్తాన్‌ 17 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. ఈ దశలో క్రీజులో ఉన్న సామ్సన్, మహిపాల్‌ లొమ్రోర్‌ (24 బంతుల్లో 19; 1 సిక్స్‌) కాసేపు వికెట్లు పడకుండా అడ్డుకున్నారు. ఈ జోడీని రబడ విడదీశాడు. 15వ ఓవర్‌లో మూడు ఫోర్లు బాదిన సామ్సన్‌ 39 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. మరో ఎండ్‌ నుంచి సహకారం అందకపోవడం... చేయాల్సిన రన్‌రేట్‌ భారీగా పెరగడంతో సామ్సన్‌ చివరి వరకు నిలిచినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు.

స్కోరు వివరాలు
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) లివింగ్‌స్టోన్‌ (బి) సకారియా 10; ధావన్‌ (బి) కార్తీక్‌ త్యాగి 8; శ్రేయస్‌ అయ్యర్‌ (స్టంప్డ్‌) సామ్సన్‌ (బి) తెవాటియా 43; పంత్‌ (బి) ముస్తఫిజుర్‌ 24; హెట్‌మైర్‌ (సి) సకారియా (బి) ముస్తఫిజుర్‌ 28; లలిత్‌ యాదవ్‌ (నాటౌట్‌) 14; అక్షర్‌ పటేల్‌ (సి) మిల్లర్‌ (బి) సకారియా 12; అశి్వన్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 154.
వికెట్ల పతనం: 1–18, 2–21, 3–83, 4–90, 5–121, 6–142. బౌలింగ్‌: ముస్తఫిజుర్‌ 4–0–22–2, మహిపాల్‌ లొమ్రోర్‌ 1–0–5–0, సకారియా 4–0–33–2, కార్తీక్‌ త్యాగి 4–0–40–1, షమ్సీ 4–0–34–0, తెవాటియా 3–0–17–1.

రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: లివింగ్‌స్టోన్‌ (సి) పంత్‌ (బి) అవేశ్‌ ఖాన్‌ 1; జైస్వాల్‌ (సి) పంత్‌ (బి) నోర్జే 5; సామ్సన్‌ (నాటౌట్‌) 70; మిల్లర్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) అశి్వన్‌ 7; మహిపాల్‌ లొమ్రోర్‌ (సి) అవేశ్‌ ఖాన్‌ (బి) రబడ 19; పరాగ్‌ (బి) పటేల్‌ 2; తెవాటియా (సి) హెట్‌మైర్‌ (బి) నోర్జే 9; షమ్సీ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 121. వికెట్ల పతనం: 1–6, 2–6, 3–17, 4–48, 5–55, 6–99. బౌలింగ్‌: అవేశ్‌ ఖాన్‌ 4–0–29–1, నోర్జే 4–0–18–2, అశ్విన్‌ 4–0–20–1, రబడ 4–0–26–1, అక్షర్‌ పటేల్‌ 4–0–27–1.

మరిన్ని వార్తలు